
భూముల హద్దుల నిర్ధారణకు తాజా నిబంధనలు
అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
నేటి నుంచి లైసెన్సుడు సర్వేయర్లకు రెండో విడత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూముల హద్దును నిర్ధారించేందుకుగాను కొత్త సర్వే మాన్యువల్‌ను రూపొందించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గత పదేళ్ల కాలంలో సర్వే విభాగం పూర్తి నిర్లక్ష్యానికి గురైందని, ప్రజాపాలనలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా సర్వే వ్యవస్థకు నూతన హంగులు తెస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో జరిగే సర్వేలు పారదర్శకంగా ఉండేందుకు గాను తాజా నిబంధనలు తయారు చేయాలని, సర్వే మాన్యువల్ తయారీకి అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని కోరారు. ఆదివారం సర్వే విభాగంపై సమీక్ష సందర్భంగా పొంగులేటి మాట్లాడారు.
అక్టోబర్ 2 నుంచి లైసెన్సుడు సర్వేయర్ల వ్యవస్థ
అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి నాటికి రాష్ట్రంలో లైసెన్సుడు సర్వేయర్ల వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. లైసెన్సుడు సర్వేయర్ల నియామకంలో భాగంగా ఈ ఏడాది మే 26 నుంచి జూలై 26 వరకు జిల్లా కేంద్రాల్లో 7 వేల మందికి తొలి విడత శిక్షణ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. గత నెల 28, 29 తేదీల్లో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించామని, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి 40 రోజుల పాటు ఇచ్చే అప్రెంటిస్ శిక్షణ కూడా పూర్తి చేశామని చెప్పారు.
రెండోదశ శిక్షణ ఈ నెల 18వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభిస్తున్నామని, ఈ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10 గంటల లోపు సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్లకు రిపోర్టు చేయాలని సూచించారు. భూ భారతి చట్టంలో భాగంగా రిజి్రస్టేషన్ల సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో సర్వేయర్ల వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. రెవెన్యూ, సర్వే విభాగాల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా లైసెన్సుడు సర్వే వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నామని పొంగులేటి వివరించారు.