
2400 నాటి ఘటనలతో.. నీలి
నటుడు నట్టితో నిర్మాత మనో ఉదయకుమార్
తమిళ సినిమా: చరిత్రను తిరగేస్తే పలు ఆసక్తికరమైన ఘటనలు వెలుగు చూస్తాయి. అలా 2400 నాటి ఘటనలతో నీలి అనే చిత్రం రూపొందనుంది. ఇందులో ఛాయాగ్రహకుడు, నటుడు నట్టి కథానాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని ఉదయ క్రియేషన్స్ పతాకంపై మనో ఉదయకుమార్ నిర్మించనున్నారు. ఇంతకు ముందు నీంగాద ఎన్నం, మేల్ నాట్టి మరుమగన్ చిత్రాలను తెరకెక్కించిన ఎంఎస్‌ఎస్ ఈ చిత్రానికి కథ,దర్శకత్వం బాద్యతలను నిర్వహించనున్నారు. దీని గురించి చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఇది చరిత్రలోని కొన్ని యధార్ధ సంఘటనలకు మరి కొన్ని కల్పిత సంఘటనలను చేర్చి రూపొందిస్తున్న కథా చిత్రం అని చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఇది అమానుష ఘటనలతో కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. కథ, కథనం చాలా ఆసక్తిగా ఉంటాయన్నారు. దీనికి నీలి అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు చెప్పారు. 2400 నాటి చరిత్రకు సంబంధించిన పలు విషయాలను పరిశోధించి ఈ కథను సిద్దం చేసినట్లు చెప్పారు. కథ వినగానే నటుడు నట్టి బాగుందంటూ వెంటనే ఇందులో నటించడానికి సమ్మతించారని చెప్పారు. ఇందులో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు నటించనున్నారనీ, వారి ఎంపిక జరుగుతున్నట్లు చెప్పారు. కాగా భారీఎత్తున నిర్మించనున్న ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు.