
వైభవం..పార్వేట ఉత్సవం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవాన్ని శ్రీవారిమెట్టు సమీపంలో గురువారం వైభవంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు పార్వేట మండపానికి చేరుకుంది. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో దుష్టశిక్షణ కోసం స్వామివారు పంచాయుధాలను ధరించి మూడుసార్లు బళ్లెంను ప్రయోగించారు. ఆస్థానం అనంతరం సాయంత్రం ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్ పాల్గొన్నారు.