గెలుపు గుర్రం ఎవరు?
భానుపురి (సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కావడంతో ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. ఎక్కడ చూసినా మన మనిషికి రిజర్వేషన్ అనుకూలించిందా..? గెలుపు గుర్రమేనా..? ఏ వార్డులో ఎవరు ఉన్నారన్న.. చర్చలు జోరుగా సాగుతున్నాయి. కొన్నిచోట్ల రాజకీయాలను పక్కనబెట్టి ఆశావాహుల వ్యక్తిగత చరిష్మా, గ్రామాల్లో మంచి పేరున్న వారిని రాజకీయాల్లో తీసుకొచ్చే మంతనాలు జోరుగా సాగుతున్నాయి. ఇక బరిలో ఉండాలనుకున్న ఆశావహులు గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు తమ గాడ్‌ఫాదర్ల మద్దతు కోసం క్యూ కడుతున్నారు. ఇక ఇప్పటికే గ్రామాల్లో పట్టున్న నాయకులు సైతం తమకు అనుకూలమైన వ్యక్తులను సర్పంచ్, వార్డుసభ్యులుగా ఎన్నుకునేలా పావులు కదుపుతున్నారు. ప్రధానంగా సర్పంచ్ ఎన్నిక కోసం సామాజిక వర్గం, ధనబలం, మంచి పేరున్న అభ్యర్థుల కోసం అన్వేషణ షురూ అయింది.
పార్టీలతో సంబంధం లేకున్నా..
వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు పార్టీలతో ఎలాంటి సంబంధం ఉండదు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగవు. కానీ అన్ని రాజకీయ పార్టీలు సర్పంచ్ ఎన్నికలను ఈ సారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీలు సైతం తమవర్గం వ్యక్తి, తాము బలపర్చిన వ్యక్తులే సర్పంచ్‌గా గెలవాలన్న కసిలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తమకు అనుకూలమైన వ్యక్తి గెలిస్తేనే రానున్న రోజుల్లో జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను సైతం సులువుగా గెలుచుకునేందుకు వీలుంటుందన్న భావనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలే తమ ప్రచారాస్త్రాలుగా రంగంలోకి దిగింది. సన్నబియ్యం, రేషన్ బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఆ పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
గెలిస్తేనే నిలుస్తామని..
మొదడి విడత ఎన్నికలకు గురువారం నుంచే నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మండలాలు, గ్రామాలు, వార్డుల్లో తమ కేడర్ నుంచి బలమైన వ్యక్తులను బరిలో ఉంచాలని ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే నిలుస్తామని బీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల నుంచి అందిన ఆదేశాల మేరకు గెలుపు గుర్రాల వేట ముమ్మరంగా సాగుతోంది. నామినేషన్ల కోసం శుక్ర, శనివారాలు మాత్రమే అవకాశం ఉండడంతో ఈ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
గ్రామాల్లో అభ్యర్థుల కోసం
అన్వేషణ
తాము బలపర్చిన అభ్యర్థే
గెలవాలన్న కసిలో పార్టీలు
మొదటి విడత ఎన్నికల పల్లెల్లో
వేడెక్కిన రాజకీయం


