ఏపూర్‌లో బ్యాటరీ ఇంధన ప్లాంట్
నాలుగైదు నెలల్లో పనులు మొదలు
చిట్యాల : తక్కువ వ్యయంతో నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు కరెంట్ సరఫరాలో సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రెండు బ్యాటరీ ఇంధన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఇటీవల అనుమతులు జారీ చేసింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రాంతంలో, నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలో 750 మెగావాట్ల సామర్ధ్యంతో బ్యాటరీ ఇంధన ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఏపూర్ గ్రామంలో మూడేళ్ల క్రితం సుమారు 109 ఎకరాల్లో తెలంగాణ ట్రాన్స్‌కో 440 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సబ్‌స్టేషన్‌కు ఖమ్మంతో పాటు త్వరలో విద్యుత్ ఉత్పత్తి జరగనున్న దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ గ్రిడ్‌ల ద్వారా కరెంటు సరఫరా అవుతుంది. ఇక్కడి నుంచి చౌటుప్పల్‌తో పాటు గ్రేటర్ హైదరాబాద్ నగరానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తారు. అంతేకాకుండా అత్యవసర సమయంలో, రోజువారి విద్యుత్ వినియోగం పెరిగినప్పుడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా భారత ఇంధన ఎక్స్ఛేంజి(ఐఈఎక్స్) నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)కు అదనపు ఆర్థిక భారం పడుతుంది. దీనిని నివారించడానికి బ్యాటరీ ఇంధన ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు.
10 నుంచి 15 ఎకరాలు కేటాయింపు..
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో బ్యాటరీ ఇంధన ప్లాంటు ఏర్పాటుకు అనువైన స్థలం లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో, చిట్యాల మండలం ఏపూర్‌లో రెండు బ్యాటరీ ఇంధన ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఏపూర్‌లోని 440 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో బ్యాటరీ ఇంధన ప్లాంట్ ఏర్పాటుకు పది నుంచి పదిహేను ఎకరాల భూమిని కేటాయించనున్నారు. ఇందులో 187.50 మెగావాట్ల సామర్ధ్యం గల నాలుగు బేస్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బ్యాటరీ ఇంధన ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సుమారు రూ.250కోట్ల నుంచి రూ.300కోట్ల వరకు నిధులు కేటాయించనుంది. ఈ బ్యాటరీ ఇంధన ప్లాంట్ ఏర్పాటుతో అత్యవసర సమయాల్లో సుమారు పదహారు గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయవచ్చు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌కు విద్యుత్ సమస్య లేకుండా చేసేందుకు వీలవుతుంది.
ఫ ఏర్పాటుకు అనుమతులు
జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఫ సుమారు రూ.250కోట్ల నుంచి రూ.300కోట్ల వరకు నిధులు కేటాయించే అవకాశం
ఫ త్వరలో ప్రారంభంకానున్న పనులు
ఏపూర్‌లో బ్యాటరీ ఇంధన ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. త్వరలో ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించనుంది. ఆ తర్వాత నాలుగైదు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభం కావొచ్చు.
– కిశోర్, ఏఈ(ఆపరేషన్),
440 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, ఏపూరు


