మూడు నెలలు.. ఆరుసార్లు! | - | Sakshi
Sakshi News home page

మూడు నెలలు.. ఆరుసార్లు!

Jun 5 2025 2:11 AM | Updated on Jun 5 2025 2:11 AM

మూడు

మూడు నెలలు.. ఆరుసార్లు!

నాగారం : రేషన్‌ దుకాణాల్లో బియ్యం పంపిణీ మొదలైంది. రెండు, మూడు నిమిషాల వ్యవధిలో పూర్తయ్యే పంపిణీ ప్రక్రియ ఇప్పుడు ఆలస్యమవుతోంది. ఎక్కువ బియ్యం ఇవ్వాల్సి రావడంతో అన్ని రేషన్‌ దుకాణాల వద్ద రద్దీ నెలకొంటోంది. దీనివల్ల డీలర్లకు, లబ్ధిదారులకు ఇబ్బంది కలుగుతోంది. బియ్యం పంపిణీకి వినియోగించే ఈ–పాస్‌ యంత్రాల అప్‌డేట్‌, మూడు మాసాల బియ్యం ఒకేసారి పంపిణీ, మారిన సాఫ్ట్‌వేర్‌ తదితర కారణాలు లబ్ధిదారులకు శాపంగా మారాయి. ఒక్కొక్కరికీ బియ్యం పంపిణీకి సుమారు 15 నిమిషాల సమయం పడుతోంది. దీంతో రేషన్‌ దుకాణాల వద్ద వినియోగదారులు విసుగు చెందుతున్నారు.

జిల్లాలో 610 రేషన్‌ దుకాణాలు

జిల్లా వ్యాప్తంగా 610 రేషన్‌ దుకాణాలు, 3.24 లక్షల రేషన్‌ కార్డులున్నాయి. వీటిలో 9.31లక్షల మంది సభ్యులుగా నమోదై ఉన్నారు. వీరికోసం మూడు నెలలకు గాను 1,78,000 క్వింటాళ్ల బియ్యం అవసరమని అధికారులు గుర్తించారు. ఆ మేరకు నిల్వలను సర్దుబాటు చేస్తున్నారు.

ఆరు సార్లు వేలి ముద్రలు..

రేషన్‌ దుకాణాల్లో కార్డుదారుల్లోని ఒక్కో సభ్యుడికి 6 కిలోలు చొప్పున బియ్యం ఇస్తారు. అంత్యోదయ కార్డు కింద 35 కిలోలు, అన్నపూర్ణ కార్డు ఉన్నవారికి ఉచిత బియ్యం ఇచ్చేవారు. ప్రస్తుతం ప్రభుత్వాలు ఉచితంగా రేషన్‌ ఇస్తుండటంతో ఎవరూ డబ్బులు చెల్లించడం లేదు. తెల్లరేషన్‌ కార్డుదారుల్లో ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉన్నారనుకుంటే వారికి నిర్దేశిత కోటా ప్రకారం ప్రతినెలా వీరికి 24 కిలోలు బియ్యం వచ్చేది. ఇందులో కేంద్రం వాటా కింద 20 కిలోలు, రాష్ట్ర వాటా 4 కిలోలు బియ్యం ఉంటాయి. (ఒకరికి వచ్చే 6 కిలోల్లో 5 కేజీలు కేంద్రం, మిగతా 1కిలో రాష్ట్ర వాటా). ఈ బియ్యం తీసుకునేందుకు కేంద్రం, రాష్ట్ర వాటాకు సంబంధించి వేర్వేరుగా (ప్రతినెలకు రెండు సార్లు) వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు.. జూన్‌, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో మూడు నెలలకు సంబంధించి ఒక్కో లబ్ధిదారు ఆరు సార్లు వేలిముద్రలు వేయాల్సి వస్తోంది. ఒక్కో వ్యక్తి ఇన్నేసి సార్లు వేలిముద్ర వేయడం, మధ్యలో సరిగా ముద్ర పడకపోతే మరోమారు ప్రయత్నించాల్సి వస్తోంది. తర్వాత వారి బియ్యం కోటాను తూకం వేసివ్వాలి. ఈ ప్రక్రియంతా పూర్తి కావడానికి 15 నిమిషాలకు పైగాసమయం పడుతోంది. దీంతో లబ్ధి దారులంతా వారి వంతు వచ్చేవరకు ఎదురుచూడక తప్పటం లేదు. దీనికి తోడు సర్వర్‌ బిజీ, నెట్‌ సిగ్నల్‌ సక్రమంగా లేకపోవడంతో, బ్లూటూత్‌ కనెక్ట్‌ కాకపోవడం తదితర అంశాలు వేధిస్తున్నాయి. అలాగే అంత్యోదయ కార్డులు కేంద్ర వాటా కింద రావడంతో వీరు ఒకసారి (మూడు నెలలకు మూడుసార్లు) వేలిముద్ర వేస్తే సరిపోతుంది.

నెలాఖరు వరకు బియ్యం సరఫరా..

మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేపట్టడంతో ఈ నెలాఖరు వరకు బియ్యం పంపిణీ చేసేలా ఈపాస్‌ యంత్రాలు పనిచేస్తాయి. గతంలో ప్రతి నెల 15వ తేదీ వరకు పనిచేసేవి. ఇప్పుడు నెలాఖరు వరకు సమయం ఇచ్చారు. పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. కార్డుదారులు ఒకేసారి రేషన్‌ దుకాణాల వద్దకు వెళ్లి ఇబ్బందులు పడొద్దు, అందరికీ బియ్యం అందుతాయి. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు.

– మోదుగు శ్రీనివాస్‌రెడ్డి,

ఇన్‌చార్జి డీఎస్‌ఓ, సూర్యాపేట

ఒక పూట సమయం పట్టింది

రేషన్‌ బియ్యం కోసం దుకాణానికి వెళ్లి కార్డు సీరియల్‌లో పెట్టాను. నా సీరియల్‌ వచ్చేసరికి ఉదయం వెళితే మధ్యాహ్నం అయింది. నాకు ప్రతి నెలా 24 కేజీల బియ్యం వస్తాయి. మూడు నెలలకు కలిపి 72 కిలోల బియ్యం వచ్చాయి. వేలిముద్రలు వేసి బియ్యం తీసుకునేసరికి 20 నిమిషాల సమయం పట్టింది.

– ఎస్‌.కె. మన్సూర్‌, తుంగతుర్తి

రేషన్‌ బియ్యం పంపిణీకి అష్టకష్టాలు

ఫ ప్రతి కార్డుదారుడు ఆరుసార్లు వేలిముద్ర వేయాల్సిందే

ఫ ఒక్కో కార్డుకు 15 నిమిషాల సమయం

ఫ రేషన్‌దుకాణాల వద్ద లబ్ధిదారుల

పడిగాపులు

ఫ సాఫ్ట్‌వేర్‌ మార్చాలంటున్న రేషన్‌ డీలర్లు

రేషన్‌ దుకాణాలు 610

ఆహార భద్రత కార్డులు 3,04,317

అంత్యోదయ కార్డులు 19,832

అన్నపూర్ణ 36

మూడునెలల కోటా 1,78,000క్వింటాళ్లు

ఒకేసారి కేటాయిస్తే..

కేంద్ర, రాష్ట్ర వాటాల కింద వచ్చే బియ్యానికి వేర్వేరుగా వేలిముద్రను తీసుకోవడం వల్ల జాప్యం ఏర్పడుతోంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో డీలర్లు, లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో చిన్నచిన్న వాగ్వాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. పరిస్థితిలో మార్పు రావాలంటే ఒక కార్డులో ఎంత బియ్యం ఉంటే అంత మొత్తానికి ఒకేసారి వేలిముద్ర వేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డీలర్లు కోరుతున్నారు. దానికనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేయాలని, అప్పుడే క్షేత్రస్థాయిలో ఫలితముంటుందని చెబుతున్నారు.

మూడు నెలలు.. ఆరుసార్లు!1
1/2

మూడు నెలలు.. ఆరుసార్లు!

మూడు నెలలు.. ఆరుసార్లు!2
2/2

మూడు నెలలు.. ఆరుసార్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement