
ఎండిన వక్క రైతుల ఆశలు
ధరపైనే రైతుల ఆశలు
మడకశిర: జిల్లాలోనే మడకశిర నియోజకవర్గంలో వక్క తోటలు అధికం. నియోజకవర్గంలోని రైతులను ఆర్థికంగా వక్క తోటలు ప్రతి ఏడాది అంతో ఇంతో ఆదుకుంటున్నాయి. ఈ ఏడాది కూడా వక్క తోటల ఆదాయంపై రైతులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశల అడియాశలయ్యాయి. రైతులు ఆశించినంత దిగుబడి ఈ ఏడాది వక్క తోటల్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ఎండ ప్రభావం
నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో వక్క తోటలు విస్తరించి ఉన్నాయి. దాదాపు 1,500 హెక్టార్లలో పంటకొచ్చిన వక్క తోటలు ఉన్నాయి. ప్రతి ఏడాది వక్క తోటల నుంచి రైతులకు రూ. కోట్లల్లో ఆదాయం లభిస్తోంది. దాదాపు 10 వేల మంది రైతులు వక్క తోటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ ఏడాది అధిక ఎండలు వక్క తోటల రైతులను నట్టేట ముంచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈఏడాది ఎండలు దంచి కొట్టాయి. ఉష్ణోగ్రతలు మడకశిర ప్రాంతంలో 42 డిగ్రీ వరకూ నమోదయ్యాయి. ఆ ప్రభావం వక్క తోటలపైనా పడింది. ఎండ తీవ్రతకు వక్క కంకులు చెట్లలోనే ఎండిపోయాయి. వేసవి కాలంలోనే వక్క చెట్లలో కంకులు వస్తాయి. ఒక చెట్టుకు 5 నుంచి 10 వరకు వక్క కంకులు ఉంటాయి. ఇందులో ఎండ తీవ్రతకు రెండు నుంచి 3 వరకు వక్క కంకులు ఎండిపోయాయి. దీంతో ఈ ఏడాది వక్క దిగుబడి తగ్గడానికి ఎండ తీవ్రత కారణంగా మారింది.
చెట్లలోనే ఎండిపోయిన వక్క కంకులు
తగ్గనున్న దిగుబడి
ఈ ఏడాది గిట్టుబాటు కాదంటున్న రైతులు
వక్క ధరపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. దిగుబడిపై ఆశలు వదులుకున్న రైతాంగం ధర ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు. దిగుబడి తగ్గినా ధర ఆశాజనంగా ఉంటే వక్క రైతుల ఆదాయం బాగుండే అవకాశం ఉంటుంది. లేకపోతే వక్క రైతులకు నష్టాలు తప్పవని అంటున్నారు. వక్క ధర క్వింటాల్ రూ. 50 వేల నుంచి రూ.55 వేల వరకు పలికితే రైతుల ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వక్క రైతులకు ఈఏడాది గడ్డు కాలమే.

ఎండిన వక్క రైతుల ఆశలు