BGT 2023: చరిత్ర సృష్టించేందుకు 64 పరుగుల దూరంలో ఉన్న కింగ్‌ కోహ్లి

Virat Kohli Is 64 Runs Away To Become Fastest Player To Complete 25000 Runs - Sakshi

Virat Kohli: టీమిండియా స్టార్‌ ప్లేయర్‌, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించేందుకు 64 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో ఇప్పటి దాకా 546 ఇన్నింగ్స్‌ల్లో 24936 పరుగులు చేసిన కింగ్‌.. BGT 2023లో భాగంగా ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభంకాబోయే తొలి టెస్ట్‌లో మరో 64 పరుగులు చేస్తే, అత్యంత వేగంగా పాతిక వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు.

సచిన్‌కు 24000 పరుగులు పూర్తి చేసేందుకే 543 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. రికీ పాంటింగ్‌కు 565, జాక్‌ కలిస్‌కు 573, సంగక్కరకు 591 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఇక, అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లికి ముందు 25000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ (782 ఇన్నింగ్స్‌ల్లో 34357 పరుగులు) మొదటి స్థానంలో ఉండగా.. కుమార సంగక్కర (666 ఇన్నింగ్స్‌ల్లో 28016 పరుగులు), రికీ పాంటింగ్‌ (688 ఇన్నింగ్స్‌ల్లో 27483 పరుగులు), మహేళ జయవర్ధనే (725 ఇన్నింగ్స్‌ల్లో 25957 పరుగులు), జాక్‌ కలిస్‌ (617 ఇన్నింగ్స్‌ల్లో 25534) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

ఇదిలా ఉంటే, BGT 2023 సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభంకాబోయే తొలి టెస్ట్‌ కోసం భారత్‌, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నాయి. ఇరు జట్ల మధ్య గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే..  భారత్‌-ఆసీస్‌లు ఇప్పటివరకు మొత్తం 102 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో ఎదురెదురు పడగా 30 మ్యాచ్‌ల్లో టీమిండియా, 43 సందర్భాల్లో ఆసీస్‌ గెలుపొందాయి. మిగిలిన 29 మ్యాచ్‌ల్లో 28 డ్రా కాగా, ఓ మ్యాచ్‌ టైగా ముగిసింది. ఇక సిరీస్‌ల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య 27 సిరీస్‌లు జరగ్గా ఆసీస్‌ 12, భారత్‌ 10 సిరీస్‌లు గెలిచాయి. 5 సిరీస్‌లు డ్రాగా ముగిసాయి. 

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ,  మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్  

సిరీస్‌ షెడ్యూల్‌..

  • ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్‌, నాగ్‌పూర్‌
  • ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్‌, ఢిల్లీ
  • మార్చి 1-5 వరకు మూడో టెస్ట్‌, ధర్మశాల
  • మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్‌, అహ్మదాబాద్‌

వన్డే సిరీస్‌..

  • మార్చి 17న తొలి వన్డే, ముంబై
  • మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం
  • మార్చి 22న మూడో వన్డే, చెన్నై 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top