Dewald Brevis- Shikhar Dhawan: సంచలన ఇన్నింగ్స్‌.. ఒకే ఒక్క పరుగు.. ధావన్‌ రికార్డు బద్దలు.. ప్రొటిస్‌ యువ కెరటం ఏబీడీ 2.0 ఘనత

U19 WC: Baby AB Dewald Brevis Breaks Shikhar Dhawan Record 1 Run difference - Sakshi

దక్షిణాఫ్రికా యువ సంచలనం డేవాల్డ్‌ బ్రెవిస్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. అండర్‌ 19 ప్రపంచకప్‌ టోర్నీలో సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. వెస్డిండీస్‌ వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్‌ 19 వరల్డ్‌కప్‌ టోర్నీలో బ్రెవిస్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 3న జరిగిన ప్లే ఆఫ్‌(ఏడో స్థానం) మ్యాచ్‌లో 130 బంతుల్లో 138 పరుగులు స్కోరు చేసి సత్తా చాటాడు.

ఈ క్రమంలో మెగా టోర్నీలో ఇప్పటి వరకు మొత్తంగా 506 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 2004లో భారత అండర్‌ 19 జట్టులో భాగమైన ధావన్‌ ఆ ఈవెంట్‌లో మొత్తంగా 505 పరుగులు చేయగా.. బ్రెవిస్‌ ఇప్పుడు ఆ రికార్డును అధిగమించాడు. ఇక అండర్‌ 19 వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రెవిస్‌ ఒక్క పరుగు తేడాతో అగ్రస్థానానికి చేరుకోగా.. ధావన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. 

ఆ తర్వాత స్థానాలను బ్రెట్‌ విలియమ్స్‌(ఆస్ట్రేలియా- 471 పరుగులు), కామెరూన్‌ వైట్‌(ఆస్ట్రేలియా- 423 పరుగులు), డెనోవాన్‌ పాగన్‌(వెస్టిండీస్‌- 421 పరుగులు) ఆక్రమించారు. కాగా ఈ టోర్నీలో బ్రెవిస్‌ సంచలన ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు. 84.33 సగటుతో 506 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక బ్రెవిస్‌ ఆటతీరుకు ఫిదా అవుతున్న అభిమానులు అతడిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌తో పోలుస్తున్నారు.

బేబీ ఏబీడీ, ఏబీడీ 2.0 అంటూ ముద్దు పేర్లతో పిలుచుకుంటున్నారు. కాగా ఈ ప్రొటిస్‌ యువ సంచలనం ఐపీఎల్‌-2022 మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అండర్‌ 19 ప్రపంచకప్‌ టోర్నీలో దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ప్రొటిస్‌ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్రెవిస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

స్కోర్లు: బంగ్లాదేశ్‌ అండర్‌- 19: 293/8 (50)
దక్షిణాఫ్రికా అండర్‌- 19: 298/8 (48.5)

చదవండి: Yash Dhull: యశ్‌ ధుల్‌ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్‌.. క్రికెట్‌ పుస్తకాల్లో పేరుందా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top