
డిఫెండింగ్ రంజీ ఛాంపియన్స్ విదర్భకు మరో కర్ణాటక ఆటగాడు వలస రావడం దాదాపుగా ఖరారైంది. గణేశ్ సతీశ్, కరుణ్ నాయర్ లాంటి ఆటగాళ్లు కర్ణాటక నుంచి వలస వచ్చి విదర్భ తరఫున సత్తా చాటారు. తాజాగా వీరి బాటలో రవికుమార్ సమర్థ్ కూడా నడువనున్నాడు. రానున్న దేశవాలీ సీజన్ కోసం సమర్థ్ విదర్భ క్రికెట్ అసోసియేషన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడు.

డీల్ కూడా ఒకే అయినట్లు తెలుస్తుంది. సమర్థ్ కర్ణాటకకు చెందిన వాడే అయినప్పటికీ గత సీజన్‌లో ఉత్తరాఖండ్‌కు వలస వెళ్లాడు. అక్కడ సెట్ కాకపోవడంతో విదర్భవైపు మొగ్గు చూపుతున్నాడు.
సమర్థ్‌ను ఇటీవలే విదర్భను వదిలిపెట్టిన కరుణ్ నాయర్‌కు ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. 32 ఏళ్ల సమర్థ్ గతేడాది మినహా కెరీర్ మొత్తం కర్ణాటకకే ఆడాడు. కరుణ్ నాయర్ లాగే కుడి చేతి వాటం టాపార్డర్ బ్యాటర్ అయిన సమర్థ్.. 2013లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసి 95 మ్యాచ్‌ల్లో 15 సెంచరీలు, 35 అర్ద సెంచరీల సాయంతో 6157 పరుగులు చేశాడు. 71 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 10 సెంచరీలు, 17 అర్ద సెంచరీల సాయంతో 3050 పరుగులు చేశాడు. 30 టీ20ల్లో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 459 పరుగులు చేశాడు.
సమర్థ్ గత సీజన్‌లో ఉత్తరాఖండ్ తరఫున కూడా సత్తా చాటాడు. ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 649, లిస్ట్-ఏలో 385, టీ20ల్లో 184 పరుగులు చేశాడు. సమర్థ్ ఎలా చూసుకున్నా కరుణ్ నాయర్‌కు తగ్గ ఆటగాడిగా ఉంటాడు కాబట్టి, విదర్భ అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే సాహసం చేయకపోవచ్చు.
కరుణ్ గత రంజీ సీజన్‌లో విదర్భను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆతర్వాత అతను వ్యక్తిగత కారణాల చేత స్వరాష్ట్రమైన కర్ణాటకకు తిరిగి వెళ్లాడు. కరుణ్ గత రంజీ సీజన్‌లో విదర్భ తరఫున 9 మ్యాచ్‌ల్లో 863 పరుగులు చేశాడు. కరుణ్ స్థానాన్ని భర్తీ చేసుకోవడం విదర్భకు కష్టమే అయినప్పటికీ.. సమర్థ్ అతనికి ప్రత్యామ్నాయం కాగలడు.
కరుణ్‌కు ముందు గణేశ్ సతీశ్ కూడా విదర్భ తరఫున అద్భుతంగా ఆడాడు. గణేశ్ ఏకంగా తొమ్మిది సీజన్ల పాటు (2014-23) విదర్భకు సేవలందించాడు.