
దుబాయ్: వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 ప్రపంచకప్‌నకు ఒమన్, నేపాల్ జట్లు అర్హత సాధించాయి. ఆసియా క్వాలిఫయర్స్ ‘సూపర్ సిక్స్’లో ఆడిన మూడేసి మ్యాచ్‌ల్లో నెగ్గిన ఈ రెండు జట్లు వరల్డ్‌కప్‌లో పాల్గొననున్నాయి. బుధవారం సమోవాతో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ జట్టు 77 పరుగుల తేడాతో విజయం సాధించడంతోనే... ఒమన్, నేపాల్ ముందంజ వేశాయి.
వరల్డ్‌కప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొననుండగా... నేపాల్, ఒమన్‌తో ఆ సంఖ్య 19కి చేరింది. ఈ టోర్నీ నుంచి మరొక్క జట్టు మాత్రమే అర్హత సాధించాల్సి ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న యూఏఈ జట్టుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఆతిథ్య హోదాలో భారత్, శ్రీలంక ప్రపంచకప్ ఆడనుండగా... 2024 వరల్డ్ కప్ ప్రదర్శన ఆధారంగా అఫ్గానిస్తాన్, ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్ ముందంజ వేశాయి.
ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు ర్యాంకింగ్స్ ఆధారంగా మెగా టోర్నీకి అర్హత సాధించాయి. అమెరికా క్వాలిఫయర్స్ ద్వారా కెనడా జట్టు... యూరప్ క్వాలిఫయర్స్ ద్వారా ఇటలీ, నెదర్లాండ్స్ వరల్డ్‌కప్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి నమీబియా, జింబాబ్వే ముందంజ వేయగా... ఆసియా క్వాలిఫయర్స్ నుంచి తాజాగా నేపాల్, ఒమన్ వరల్డ్ కప్‌నకు అర్హత సాధించాయి. మరో జట్టు కూడా బెర్త్ దక్కించుకుంటే... ప్రపంచ కప్‌లో పోటీపడే జట్ల సంఖ్య పూర్తి కానుంది.