IPL 2023: Sanju calls Dhoni as that guy after win 'Nothing Works Against Him' - Sakshi
Sakshi News home page

Sanju Samson- MS Dhoni: మా వాళ్లు అద్భుతం.. అలాంటి పప్పులేమీ ఉడకవు.. అయితే: సంజూ శాంసన్‌

Apr 13 2023 10:17 AM | Updated on Apr 13 2023 10:55 AM

IPL 2023: Sanju Calls Dhoni As That Guy After Win Nothing Works Against Him - Sakshi

ధోనితో సంజూ శాంసన్‌ (Photo Credit: Rajasthan Royals)

IPL 2023 CSK Vs RR- Sanju Samson Comments On Dhoni: ‘‘మా వాళ్లు అద్భుతంగా ఆడారు. క్రెడిట్ వాళ్లకే దక్కుతుంది. ముఖ్యంగా మా బౌలర్లు ఆఖరి వరకు ఎంతో ఓపికగా ఎదురుచూశారు. సహనంతో బౌలింగ్‌ చేశారు. నిజానికి నాకు చెపాక్‌లో ఇప్పటిదాకా మధుర జ్ఞాపకాలు అంటూ ఏమీలేవు. ఒక్కసారి కూడా మేము ఇక్కడ గెలిచిన దాఖలాలు లేవు. 

నేటి విజయంతో ఆ అపవాదు తొలగిపోయింది. పిచ్‌ స్వభావాన్ని అంచనా వేయగలిగాం. అందుకే జంపాను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా తీసుకువచ్చాం. వాస్తవానికి పవర్‌ప్లేలోనే మాకు మంచి ఆరంభం లభించింది. రుతును అవుట్‌ చేయడం కలిసి వచ్చింది.

కానీ చివరి రెండు ఓవర్లలో మాత్రం టెన్షన్‌ తారస్థాయికి చేరింది. గెలిచేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశాం. పక్కా ప్రణాళికలు రచించుకున్నాం. అయితే, అక్కడ ఉన్న ఆ వ్యక్తి (ధోనిని ఉద్దేశించి)తో ఏదీ అంత ఈజీ కాదు. ఆయన ఏం చేయగలడో అందరికీ తెలుసు. 

ఆయన వ్యూహాలకు ఎలా చెక్‌ పెట్టాలి. ఎలా ముందుకు వెళ్లాలని డేటా టీమ్‌తో కలిసి చాలా రీసెర్చ్‌ చేశా. కానీ అలాంటి వ్యక్తి దగ్గర మన పప్పులేమీ ఉడకవు కదా. అయితే, ఈరోజు మాది అయింది’’ అని రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ అన్నాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో గెలుపు అనంతరం ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

చెపాక్‌లో తొలి గెలుపు
కాగా చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌కు ఇదే తొలి గెలుపు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభమైన నాటి నుంచి ఒక్కసారి కూడా రాజస్తాన్‌ ఇక్కడ గెలవలేకపోయింది. 2008 నుంచి వేచి చూడగా సంజూ సారథ్యంలో బుధవారం నాటి విజయంతో ఆ అపఖ్యాతి తుడిచిపెట్టుకుపోయింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 175 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (52) అర్ధ శతకంతో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెన్నైకి ఆదిలోనే షాకిచ్చాడు రాజస్తాన్‌ బౌలర్‌ సందీప్‌ శర్మ. రుతురాజ్‌ గైక్వాడ్‌(8) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపాడు.

ధోని, జడ్డూ పోరాడినా
ఈ క్రమంలో డెవాన్‌ కాన్వే (50) పట్టుదలగా నిలబడగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ అజింక్య రహానే(31) తన వంతు సహకారం అందించాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన శివం దూబే(8), అంబటి రాయుడు(1) పూర్తిగా నిరాశపరచగా.. ఆఖర్లో రవీంద్ర జడేజా 15 బంతుల్లో 25 పరుగులు, కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని 17 బంతుల్లో 32 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు.

సమిష్టి ప్రదర్శనతోనే 
కానీ ఆఖరి ఓవర్లో సందీప్‌ శర్మ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో సొంతమైదానంలో తొలిసారి రాజస్తాన్‌ చేతిలో సీఎస్‌కేకు పరాభవం తప్పలేదు. మూడు పరుగుల తేడాతో ధోని సేన ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో తమ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సంజూ శాంసన్‌.. సొంతగడ్డపై చెన్నై జట్టును ఓడించడం అంతతేలికేమీ కాదని.. సమిష్టి ప్రదర్శనతోనే గెలుపు సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. 

చదవండి: అదే మా ఓటమిని శాసించింది.. ఆ విషయం నాకు నిజంగా తెలియదు: ధోని
గెలుపు జోష్‌లో ఉన్న రాజస్తాన్‌కు బిగ్‌ షాక్‌.. భారీ జరిమానా! ఎందుకంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement