తొలి టి20లో జింబాబ్వేపై భారత మహిళల విజయం
రాణించిన దీప్తి శర్మ, నికీ ప్రసాద్
రాయ్‌పూర్: స్మృతి మంధాన పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగిన మొదటి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తడబడుతూనే గెలుపు తీరం చేరింది. బలహీన ప్రత్యర్థి జింబాబ్వేపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించడంలో జట్టు విఫలమైంది. శుక్రవారం జరిగిన తొలి టి20లో భారత్ 4 వికెట్ల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. షార్నే మాయర్స్ (33 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెలిస్ ఎన్లొవు (44 బంతుల్లో 42; 7 ఫోర్లు) రాణించారు. ఆంధ్ర లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీచరణి, నందని శర్మ పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేశారు.
అనంతరం భారత్ 15.4 ఓవర్లలో 6 వికెట్లకు 116 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అయితే ఈ గెలుపు సులువుగా దక్కలేదు. ఛేదనలో ఇబ్బంది పడిన టీమ్ 19 పరుగులకే తొలి 4 వికెట్లు చేజార్చుకుంది. ఐదు పరుగుల వ్యవధిలో స్మృతి (9), అనుష్క (4), హర్మన్‌ప్రీత్ (1), షఫాలీ (4) అవుటయ్యారు. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ (37 బంతుల్లో 49; 8 ఫోర్లు), తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న నికీ ప్రసాద్ (35 బంతుల్లో 39 నాటౌట్; 6 ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 63 బంతుల్లో 82 పరుగులు జోడించి కీలక పాత్ర పోషించడంతో మరో 26 బంతులు మిగిలి ఉండగానే జట్టు విజయం ఖాయమైంది. సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలవగా, రెండో టి20 ఆదివారం ఇదే మైదానంలో జరుగుతుంది.
95 ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన నికీ ప్రసాద్ టి20ల్లో భారత్ తరఫున బరిలోకి దిగిన 95వ ప్లేయర్‌గా నిలిచింది.


