
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌కు సమయం అసన్నమైంది. పెర్త్ వేదికగా ఆదివారం జరగనున్న తొలి వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుండగా.. ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో ఆడనుంది.
అందరి దృష్టి భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) పైనే ఉన్నాయి. వీరిద్దరూ దాదాపు ఏడు నెలల తర్వాత బ్లూ జెర్సీలో కన్పించనున్నారు. దీంతో రో-కో ద్వయం ఎలా ఆడుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టీమిండియా ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్.
పెర్త్ వేదికగా జరగనున్న తొలి వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ జరిగే సమయంలో వరుణుడు పలు మార్లు ఆటకు అంతరాయం కలిగించే అవకాశముంది. వర్షం పడేందుకు 35 శాతానికి పైగా అస్కారం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం కూడా అక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.
అయితే వర్షం కారణంగా పూర్తిగా రద్దు అయ్యే సూచనలు అయితే కన్పించడం లేదు. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పెర్త్ స్టేడియంలోని పిచ్ ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామమే అనే చెప్పుకోవాలి. కాబట్టి భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.
భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
చదవండి: ప్లే ఆఫ్స్‌కు చేరిన తెలుగు టైటాన్స్