మహ్మద్‌ రిజ్వాన్‌ను టార్గెట్‌ చేసిన ఫ్యాన్స్‌.. | Sakshi
Sakshi News home page

WC 2023: మహ్మద్‌ రిజ్వాన్‌ను టార్గెట్‌ చేసిన ఫ్యాన్స్‌..

Published Sun, Oct 15 2023 10:29 AM

Fans Trolled  Pakistan batsman Mohammad Rizwan - Sakshi

వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌పై టీమిండియా మరోసారి ఆధిపత్యం చెలాయించింది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా శనివారం అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పాక్‌ను భారత్‌ చిత్తు చేసింది. దీంతో వరుసగా 8వసారి వన్డే వరల్డ్‌ కప్‌ ఈవెంట్‌లో పాకిస్తాన్‌ను భారత్‌ మట్టికరిపించింది.

అయితే దాయాదుల పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో నరేంద్ర మోదీ స్టేడియానికి తరలివచ్చారు. మ్యాచ్ చూడ్డానికి సుమారు లక్షా 30 వేల మంది ప్రేక్షకుల తరలిరాగా.. వారిలో అత్యధికులు భారతీయులే. స్టేడియం మొత్తం బ్లూ జెర్సీలతో నిండిపోయింది. మొదట పాక్‌ వికెట్లు పడినప్పుడు, తర్వాత భారత బ్యాటింగ్‌లో రోహిత్‌ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నప్పడు అభిమానుల హర్ష ధ్వనులతో స్టేడియం దద్దరిల్లపోయింది

కాగా ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ను అభిమానులు ఓ ఆటాడేసుకున్నారు. 49 పరుగులు చేసి హాఫ్‌ సెంచరీకి చేరువలో ఉన్న రిజ్వాన్‌ను.. భారత స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా అద్భుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది.

ఈ క్రమంలో రిజ్వాన్‌ డ్రెసింగ్‌ రూమ్‌కు వెళ్తుండగా కొంతమంది అభిమానులు టీమిండియాకు సపోర్ట్‌గా నినాదాలు చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే రిజ్వాన్‌ మాత్రం ఎటువంటి రియాక్షన్‌ ఇవ్వకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపోయినట్లు ఆ వీడియోలో కన్పిస్తుంది.

ఈ నేపథ్యంలో కొంత మంది నెటిజన్లు  2017లో  పాకిస్తాన్‌ అభిమానులు కూడా ఈ విధంగానే చేశారని గుర్తు చేస్తున్నారు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్‌ చేతిలో టీమిండియా ఓటమిపాలైంది. మ్యాచ్‌ అనంతరం భారత జట్టు డ్రెసింగ్‌ రూమ్‌కు వెళ్తుండగా పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ  నినాదాలు చేసిన వీడియోలు షేర్‌ చేస్తున్నారు.

ఆ సమయంలో భారత స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి పాక్‌ అభిమానులకు చిన్నపాటి వాగ్వదం కూడా జరిగినట్లు తెలుపుతున్నారు. అదే విధంగా 1999లో ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్తాన్‌ విజయం సాధించింది. ఈ సందర్భంగా కూడా కొంతమంది ఫ్యాన్స్‌ పాక్‌ జట్టుకు మద్దతుగా స్టాండింగ్‌ ఓవిషేన్‌ ఇచ్చిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.. కానీ ఈసారి మాత్రం భారత ఫ్యాన్స్‌ పాక్‌ క్రికెటర్లను టార్గెట్‌ చేశారని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.
చదవండి: CWC 2023: పాక్‌ను చిత్తు చేసిన భారత్‌.. రోహిత్‌ సేనను అభినందించిన నరేంద్ర మోదీ

Advertisement
 
Advertisement