మారని తీరు: సిరాజ్‌పై మరోసారి జాతి వివక్ష వ్యాఖ్యలు

Brisbane Test: Racist Comments On Mohammed Siraj Repeatedly - Sakshi

బ్రిస్బేన్‌: టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై కొందరు ఆస్ట్రేలియా ప్రేక్షకులు మరోసారి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. బ్రిస్బేన్‌ వేదికగా గబ్బా స్టేడియంలో జరగుతున్న నాలుగో టెస్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయాన్ని టీమిండియా మేనేజ్‌మెంట్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియా, దాంతోపాటు ఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. కాగా, సిడ్నీ టెస్టులో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న సిరాజ్‌, బుమ్రాపై సైతం ఆస్ట్రేలియన్లు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై ఇప్పటికే టీమిండియా మేనేజ్‌మెంట్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) దృష్టికి తీసుకెళ్లగా.. చర్యలు తీసుకున్నామని తెలిపింది. కామెంట్‌ చేసిన వారిని గుర్తించి స్టేడియం నుంచి బయటకు గెంటేశామని పేర్కొంది. వారిని పోలీసులకు అప్పగిస్తామని కూడా సీఏ హామి ఇచ్చింది. వారం గడవక ముందే మళ్లీ అదే తరహా ఉదంతం వెలుగు చూడటంతో టీమిండియా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించనుంది.
(చదవండి: పంత్‌ మొత్తుకున్నా నమ్మలేదు..)

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు మెరుగైన స్థానంలో నిలిచింది. ఐదు వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (1), మార్కస్‌ హ్యారిస్‌ (5).. 17 పరుగులకే ఔటైనా లబూషేన్‌తో కలిసి మూడో టెస్టు సెంచరీ హీరో స్టీవ్‌ స్మిత్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. జట్టు స్కోరు 87 పరుగుల వద్ద స్మిత్‌ రూపంలో భారత్‌కు భారీ వికెట్‌ లభించింది. అయితే, మాథ్యూ వేడ్‌తో కలిసి లబూషేన్‌ (204 బంతుల్లో 108; 9 ఫోర్లు) టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని పరుగుల వరద పారించాడు. మూడో సెషన్‌లో ఈ ఇద్దరూ పెవిలియన్‌ చేరడంతో రహానే సేన ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం కామెరూన్‌ గ్రీన్‌ (28), కెప్టెన్‌ పైన్‌ (38) క్రీజులో ఉన్నారు. అరంగేట్ర బౌలర్‌ నటరాజన్‌ 2, శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌సుందర్‌, సిరాజ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.
(చదవండి:  లైఫ్‌ ఇచ్చారు.. మూల్యం చెల్లించుకున్నారు!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top