
ఖేడ్ సుందరీకరణకు రూ.1.28 కోట్లు
నారాయణఖేడ్: నారాయణఖేడ్ పట్టణ సుందరీకరణకు రూ.1.28కోట్లను సీడీఎంఏ నిధులు మంజూరు చేసింది. దీంతో పట్టణాన్ని సుందరీకరించి పూర్తి పట్టణ రూపురేఖలు వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. పట్టణంలో కాలనీల రహదారుల అభివృద్ధితోపాటు చౌరస్తాలను అత్యంత సుందరీకరణగా తీర్చిదిద్ది పూర్తి పట్టణ రూపురేఖలు వచ్చేలా ఏర్పాట్లు చేపడుతున్నారు.
పన్ను నిధులతోనే....
ఖేడ్ మున్సిపాలిటీలో గతేడాదికి సంబంధించి వందశాతం ఇంటి పన్ను వసూలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా అంశాల్లో రాష్ట్రస్థాయి అవార్డును దక్కించుకుంది. రాష్ట్రస్థాయిలో పది మున్సిపాలిటీలు అవార్డుకు ఎంపిక కాగా అందులో ఖేడ్ మున్సిపాలిటీ ఒకటిగా నిలిచింది. ఈ నిధులతో పట్టణంలో ప్రధాన చౌరస్తాలను అభివృద్ధి పరచడంతోపాటు సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు.
సుందరీకరణ చేపట్టే చౌరస్తాలివే...
పట్టణంలో ప్రధానంగా రాజీవ్‌చౌక్, బసవేశ్వర చౌక్, గాంధీచౌక్, అంబేడ్కర్‌చౌక్, సేవాలాల్, శివాజీ చౌరస్తాలున్నాయి. ఈ చౌరస్తాల చుట్టూ సర్కిల్ ఏర్పాటు చేసి గ్రీనరీ, ఫౌంటెయిన్ నిర్మించనున్నారు. ఒక ప్రక్కగా ఉన్న రాజీవ్‌చౌక్‌ను సెంటర్‌లోకి మార్చి వాహనాల రాకపోకలకు అనువుగా ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. పట్టణంలో ప్రధాన చౌరస్తా కావడంతో దీని చుట్టూ సర్కిల్ ఏర్పాటు చేసి గ్రీనరీ, ఫౌంటెయిన్, రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. గాంధీచౌక్‌ను సైతం సెంటర్‌లోకి మార్చనున్నారు. వీటితోపాటు బసవేశ్వర చౌక్, అంబేడ్కర్ చౌక్, సేవాలాల్ చౌక్‌లను సుందరంగా ఏర్పాటు చేయనున్నారు. త్వరలో పనులకు సంబంధించి టెండర్లను పిలవనున్నారు.
రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు
ఇప్పటికే రూ.20 కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో పట్టణంలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులు చేపట్టారు. ఆయా పాత, కొత్త కాలనీల్లో ఈ రహదారులు, మురుగు కాల్వల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అవసరం మేరకు ఆయా పనులను విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
చౌరస్తాల అభివృద్ధి పనులకు ఏర్పాట్లు
చౌరస్తాల నుసుందరీకరిస్తాం
పట్టణంలోని ప్రధాన చౌరస్తాలను సుందరీకరిస్తాం. ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్‌ల కృషి వల్ల పట్టణంలో రూ.20కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాల్వల పనులు జోరుగా చేపట్టాం. ప్రధాన చౌరస్తాలను సీడీఎంఏ నిధులతో సర్కిల్, గ్రీనరీ, ఫౌంటెయిన్‌లతో ఏర్పాటు చేస్తాం. అవసరమైన చౌరస్తాలను సెంటర్‌లో మార్చి అభివృద్ధి చేపడతాం.
–జగ్జీవన్,
మున్సిపల్ కమిషనర్, నారాయణఖేడ్

ఖేడ్ సుందరీకరణకు రూ.1.28 కోట్లు