
ఊరిస్తూ.. ఉస్సూరుమనిపిస్తూ!
నిమ్జ్ కోసం భూసేకరణ సరే..పరిశ్రమలేవీ..?
● భూములు కోల్పోయి దశాబ్దం గడుస్తున్నా..
● ఉపాధి దక్కేదెన్నడంటున్న నిర్వాసితులు..
● ఇప్పటికే సేకరించిన భూములు 5,109 ఎకరాలు..
● తాజాగా 941 ఎకరాల సేకరణకు మరో నోటిఫికేషన్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిమ్జ్ (జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి) భూసేకరణ తీరు విమర్శలకు దారితీస్తోంది. ఈ నిమ్జ్ కోసం దశాబ్ద కాలంగా వందల ఎకరాల భూములు సేకరిస్తున్నారు. కానీ, ఇప్పటికీ ఈ నిమ్జ్‌లో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా ఉత్పత్తిని ప్రారంభించలేదు. భూములు పొందిన ఒకటీ రెండు పరిశ్రమలు కూడా కనీసం వాటి నిర్మాణం పనులకు కూడా శ్రీకారం చుట్టలేదు. అయితే భూముల సేకరణ ప్రక్రియ మాత్రం నిరాటంకంగా కొనసాగుతోంది. తాజాగా న్యాల్‌కల్ మండలం హుస్సెల్లీలో 653 ఎకరాలు, హద్నూరులో 288 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం మరో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇలా ఈ నిమ్జ్ కోసం వందలాది మంది రైతులు భూములు కోల్పోతున్నప్పటికీ.. తమకు కనీస ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మాత్రం రావడం లేదని నిర్వాసిత రైతులు, రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2014 నుంచి కొనసాగుతున్న సేకరణ
తొలిసారిగా ఈ నిమ్జ్ కోసం 2014లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామం పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను 2015లో పంపిణీ చేశారు. అలాగే చీలపల్లి, ఎల్గొయి తదితర గ్రామాల్లో కూడా భూములను సేకరించారు. ఇలా తొలి విడతలో 2,892 ఎకరాలను సేకరించి దాదాపు దశాబ్దం గడిచినా ఒక్క పరిశ్రమ కూడా ఉత్పత్తిని ప్రారంభించలేదు. ఒక్క ఉద్యోగాన్నివ్వలేదు. ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదు. ఉన్న భూములు కోల్పోయి రైతుల పరిస్థితి ఇప్పుడు ఆగమ్య గోచరంగా తయారైంది.
ఏళ్ల తరబడి జాప్యం..
పలు బహుళజాతి కంపెనీలు ఈ నిమ్జ్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తున్నాయి. ఈ మేరకు భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని ప్రకటిస్తున్నాయి. ప్రముఖ వాహనాల ఉత్పత్తి సంస్థ ట్రైటాన్ ఈ నిమ్జ్‌లో రూ.2,100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ట్లు రెండేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. అలాగే రక్షణరంగ ఉత్పత్తులు చేసే మరో సంస్థ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని భావించాయి. ఈ మేరకు ప్రభుత్వ పెద్దలతో ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ, ఇప్పటివరకు ఒక్క పరిశ్రమ నిర్మాణం దిశగా శ్రీకారం చుట్టలేదు. ఉత్పత్తిని ప్రారంభించలేదు. దీంతో భూములు కోల్పోతున్న రైతులు మాత్రం నిర్వాసితులుగా మారుతున్నారు.
12,635 ఎకరాల లక్ష్యం..
మూడు లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..రూ.వేల కోట్ల పెట్టుబడులు అంటూ ఊరిస్తున్న ప్రభుత్వం 2012లో జహీరాబాద్ వద్ద ఈ నిమ్జ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఈ నిమ్జ్ కోసం న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల పరిధిలో 17 గ్రామాల పరిధిలో మొత్తం 12,635 ఎకరాల భూములు సేకరించి ఇవ్వాలని టీజీఐఐసీ రెవెన్యూశాఖను అభ్యర్థించింది. తొలివిడతలో సేకరించిన 2,892 లతో రెండో విడతలో సేకరించిన భూములతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 5,109 ఎకరాలను తీసుకున్నారు. మిగిలిన 7,526 ఎకరాలను ఇంకా సేకరించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తాజా నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ భూసేకరణ కోసం ప్రభుత్వం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ను నియమించిన సంగతి తెలిసిందే.