
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
అక్కన్నపేట(హుస్నాబాద్): విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమై ఘటన అక్కన్నపేట మండలం పంతుల్‌తండా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన భానోతు పకాలియా–సారవ్వ కుటుంబ సభ్యులు గురువారం వ్యవసాయ పొలం పనులు వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో మీటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ఇరుగుపొరుగు వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మంట లార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సగానికి పైగా వస్తువులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇటీవల మహిళా సంఘం ద్వారా వచ్చిన డబ్బులు రూ.లక్ష ఇంట్లో దాచిపెట్టగా బుగ్గిపాలయ్యాయి. అదే విధంగా ఫ్యాన్లు, గిన్నెలు, ఫ్రీజ్, కూలర్‌తోపాటు బియ్యం బస్తాలు దగ్ధమయ్యాయి. వాటి విలువ రూ.4 లక్షలు ఉంటుందని బాధితులు వాపోయారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని బీజేపీ మండలాధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి, గిరిజన మోర్చా మండలాధ్యక్షుడు రైనా నాయక్ తదితరులు ప్రభుత్వాన్ని కోరారు.
రూ.లక్ష నగదు, విలువైన వస్తువులు కాలి బూడిద