
అధ్యాపకుడికి ప్రతిభా అవార్డు
సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా పని చేస్తున్న డాక్టర్ వైకుంఠం కళారంగంలో చేసిన సేవలకుగాను సౌత్ ఇండియన్ కల్చరల్ ఫెస్టివల్స్ ఉగాది పురస్కారాల్లో భాగంగా అవార్డును అందుకున్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కల్చరల్ ఫైన్‌ఆర్ట్స్ ఫెడరేషన్ హైద్రాబాద్, ఆదిలీలా ఫౌండేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో అక్కడి లోక్ కళామంచ్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును అందించినట్లు చెప్పారు. ఐటీ శాఖ సూపరింటెండెంట్ నాగేశ్వర్‌రావు, సినీ నిర్మాత మంత శ్రీనివాస్, ఫైన్ ఆర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, ఆది ఫౌండేషన్ చైర్మన్ ఆది నారాయణ, సీనియర్ కూచిపూడి నాట్యగురు సీతనాగజ్యోతి తదితరులు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని కళామతల్లి సేవలో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటానన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, వైస్ పిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, సీఈఓ డాక్టర్ గోపాలసుదర్శనం, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ మధుసూదన్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శ్రద్ధానందం, ఇన్‌చార్జి పీడీ విశ్వనాథం తదితరులు వైకుంఠంను అభినందించారు.
చర్చలతోనే సమస్యలు పరిష్కారం
– అరుణోదయ సాంస్కృతిక
నాయకురాలు విమలక్క
హుస్నాబాద్: పీపుల్స్‌వార్ చర్చలకు ముందుకు రావడం, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఇరుపక్షాల చర్చలతో సమస్యలు పరిష్కామవుతాయని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలో జనశక్తి నాయకుడు రిక్కల సహదేవ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కొద్ది సేపు మాట్లాడారు. బూటకపు ఎన్‌కౌంటర్‌లో సహదేవ రెడ్డి అమరుడయ్యాడని తెలిపారు. తాను ఏదైతే సమ సమాజం కోసం కలలు కన్నాడో దాని కోసం పోరాడటమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అన్నారు. కలలు నెరవేర్చడానికి పౌర సమాజం ఆ దిశగా ఆలోచించాలన్నారు. ముంచుకొస్తున్న ఫాసిజానికి వ్యతిరేకంగా విశాల దృక్పథంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు కృషి జరగాలన్నారు. మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు ముందుకురాలని అన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
మనోహరాబాద్(తూప్రాన్): తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన మండల పరిధిలోని రంగాయపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దానప్ప సత్యనారాయణ బంధువుల పెళ్లి నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. సోమవారం ఇంటికొచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని అరతులం బంగారం, ఆరు తులాల వెండి, రూ.80 వేల నగదు కనిపించలేదు. దొంగలు చోరీ చేసినట్లు గుర్తించి మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ తెలిపారు.
తడిసిన ధాన్యం..
రైతుల దైన్యం
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని పలు గ్రామాలలో సోమవారం మధ్యాహ్నం కురిసిన ఆకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది. కొన్ని చోట్ల వడగళ్లు కురవడంతో వరి పంట దెబ్బతింది. మండలంలోని వల్లంపట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు.

అధ్యాపకుడికి ప్రతిభా అవార్డు

అధ్యాపకుడికి ప్రతిభా అవార్డు

అధ్యాపకుడికి ప్రతిభా అవార్డు