
చలివేంద్రం చాటున ‘ప్రైవేట్’ ప్రచారం
సిద్దిపేటకమాన్: సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రి ఎదుట ఓ ప్రైవేటు హాస్పిటల్ నిర్వాహకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. వేసవి దృష్ట్యా ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు చలివేంద్రం ఏర్పాటు చేసి నిర్వహణ మరిచారు. గత నాలుగు రోజులుగా చలివేంద్రంలో నీరు ఉండటం లేదని, వాటిని పట్టించుకునే వారు లేరని పలువురు చర్చించుకుంటున్నారు. చలివేంద్రం వద్ద ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రికి వైద్య సేవల నిమిత్తం వచ్చిన పేషెంట్లను కమీషన్‌లకు ఆశపడి ఆస్పత్రి సిబ్బంది వారిని ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఆస్పత్రి ముందు చలివేంద్రం ఏర్పాటు చేయడంతో పక్కన అంబులెన్స్ వాహనాలు నిలపడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలోనికి వెళ్లే సమయంలో వాహనదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వైద్యాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. కాగా ప్రభుత్వాస్పత్రిలో సాయంత్రం తర్వాత మంచినీరు రావడం లేదని, బయట నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇన్ పెషెంట్స్ వార్డులలోని వాష్ రూమ్‌లలో కూడా నీరు రావడం లేదని చికిత్స పొందుతున్న సైతం ఆరోపిస్తున్నారు.
ఓ ఆస్పత్రి నిర్వాకం
కమీషన్లకు ఆశపడి పట్టించుకోని అధికారులు