
ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం
అధికారులకు కలెక్టర్ క్రాంతి ఆదేశం
కంది(సంగారెడ్డి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారు లను ఆదేశించారు. మండల పరిధిలోని చేర్యాలలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బుధవారం కలెక్టర్ క్రాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన చేర్యాల గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలన్నారు. అలాగే నిర్మాణపు పనుల్లో నాణ్యత, నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ప్రతీ ఇల్లు 400ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలన్నారు. గ్రామంలో 65ఇళ్లు మంజూరు కాగా 12ఇళ్లు బేస్‌మెంట్‌స్థాయిలో ఉన్నాయని హౌసింగ్ పీడీ చలపతిరావు తెలిపారు. అనంతరం కందిలో నిర్మిస్తోన్న ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ సరఫరా, మంచి నీరు,మురుగు కాలువల ఏర్పాటు వంటి మౌలిక వసతులను కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో శ్రీనివాస్, హౌసింగ్ ఏఈ మాధవరెడ్డి, ఎంపీవో మహేందర్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థలకు
తోడ్పాటు హర్షణీయం
సంగారెడ్డి జోన్: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రైవేటు సంస్థలు భాగస్వాములు కావడం అభినందనీయమని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. పోతిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో కెరియర్ టెక్నాలజీ సంస్థ సిబ్బంది పాఠశాలలను దత్తత తీసుకుని మౌలిక వసతులకల్పన చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి బుధవారం కలెక్టర్ క్రాంతి హాజరయ్యారు. పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన టాయిలెట్స్, తాగునీటి ట్యాంకును, కుళాయిలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని నిరుపేద విద్యార్థుల సంక్షేమం కోసం ప్రైవేట్ సంస్థల యాజమాన్యం సిబ్బంది కృషి చేయడం హర్షించదగ్గ పరిణామమన్నారు. రూ.50 లక్షలతో తరగతి గదుల ఆధునీకరణ, క్రీడా పరికరాలు, సైన్స్ మెటీరియల్‌ను, మౌలిక సదుపాయాలు, కెరియర్ అవగాహన చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, కెరియర్ టెక్నాలజీ సంస్థ నిర్మాణ అధినేత నందా లక్కిరాజు, నిర్మాణ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి అనురాధ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.