
బొట్టు బొట్టు ఒడిసి పట్టి..
ఆలోచనకు పదును పెట్టి..
డ్రిప్ పద్ధతిలో వరి సాగు
● మదిర గ్రామం ఆరెపల్లికి చెందిన రైతు రాజేందర్ వినూత్న ఆలోచన
● 24 గంటలపాటు నీటి తడులు
● మండు వేసవిలోనూ పైరు పచ్చగా..
● సమయం, పెట్టుబడి ఖర్చులు ఆదా
● తప్పనున్న కూలీల బెడద
రోజురోజుకూ ఎండ ప్రచండంగా మారుతున్న పరిస్థితుల్లో భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. వరికి సాగుకు నీరందక చేలన్నీ ఎండిపోయి బీటలు వారుతున్నాయి. ఇక చేసేది లేక రైతులు ఎండిన పొలాల్లో పశువులను మేపుతున్నారు. కానీ, ఇలాంటి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయాలని మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామ పంచాయతీ మదిర గ్రామం ఆరెపల్లికి చెందిన లకిడి రాజేందర్ తన ఆలోచనకు పదును పెట్టాడు. బొట్టు బొట్టునూ ఒడిసి పట్టి డ్రిప్‌తో ఎకరంలో వరి సాగుకు శ్రీకారం చుట్టాడు. మండు వేసవిలో నీటిని ఒసిడి పడుతూ డ్రిప్ ద్వారా పంటకు నీటి తడిని అందిస్తున్నాడు. దీంతో వరి పచ్చగా ఎదుగుతూ దర్శనమిస్తుంది. – మిరుదొడ్డి(దుబ్బాక)
సాఽదారణంగా వరి సాగు చేయాలంటే నీటి అవసరం చాలా ఉంటుంది. వరి సాగుకు పొలం నిండా నీరు ఉంటేనే దిగుబడులు వస్తాయి. డ్రిప్ ద్వారా వరి మొక్కలకు బొట్టు బొట్టుతో నీటిని అందిస్తే సరిపోతుంది. అలాగే ఖర్చులు కూడా తగ్గుతాయి . వరి సాగుకు సంబంధించి బురద పొలాన్ని నాగలితో లేదా ట్రాక్టర్‌తో దున్నడం, గొర్రుతో చదును చేయడం, వరి నారు పోయడం, నారు పీకడం, నాట్లేయడం, కలుపు తీయడం వంటి పనులతో శ్రమ, ఖర్చుతో కూడుకున్న పని. పొలాన్ని దున్ని నాటు వేసే వరకు పెట్టుబడులు తలకు మించిన భారంగా మారుతాయి. అదే డ్రిప్ సాగులో ఒకే సారి దుక్కి దున్ని, పొలాన్ని చదును చేసి సీడర్‌తో విత్తనాలు పెట్టుకొని డ్రిప్ ద్వారా నీటి తడిని అందిస్తే తక్కువ ఖర్చుతో గట్టెక్కవచ్చు.
కూలీల కొరత తప్పుతుంది
డ్రిప్ సాయంతో సాగు చేస్తున్న వరికి కూలీల కొరత తప్పుతుంది. నేరుగా విత్తుకున్న పొలంలో ఎక్కువగా కలుపు రాదు. దీంతో కూలీల అవసరం కూడా ఉండదు. కలుపు నివారణకు అందుబాటులో ఉన్న గడ్డి నివారణ మందును పిచికారీ చేసుకునే వీలు కలుగుతుంది. అలాగే యూరియా, పొటాష్ వంటి రసాయన ఎరువులను చల్లడం వల్ల ఎక్కువ ఖర్చవుతుంది. అదే డ్రిప్ సాగులో లిక్విడ్ యూరియాను పైపుల ద్వారా వరి దుబ్బలకు నేరుగా అందిస్తే మంచి పోషకాలు అందుతాయి. మోతాదు కంటే ఎక్కువగా వాడే రసాయన ఎరువుల ఖర్చు సైతం తగ్గుతుంది.
ఎండను తట్టుకునేలా..
సాగు నీరందక వరి చేలు ఎండుముఖం పడుతున్న నేపథ్యంలో 24 గంటల పాటు డ్రిప్ ద్వారా బొట్టు బొట్టుగా నీటి తడి నిరంతరం అందుతుండటంతో వరి దుబ్బులు పచ్చగా కళకళలాడుతూ ఎండను తట్టుకుంటున్నాయి. డ్రిప్ సాయంతో సాగవుతున్న వరికి పెద్దగా పెట్టుబడులు పెట్టకుండా సమయాన్ని, సాగు నీటిని ఆదా చేసుకునే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
తుంపర సేద్యం మేలు
చిన్నకోడూరు(సిద్దిపేట): ఎండలు మొదలు కావడంతో ఉన్న కొద్దిపాటి నీటితో తుంపర పరికరాల ద్వారా రైతులు ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. తద్వారా రైతుకు శ్రమ తగ్గడంతో పాటు నీరు కూడా తక్కువ అవసరం ఉంటుంది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయొచ్చు. దీంతో రైతులు తుంపర సేద్యం ద్వారా ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు.

బొట్టు బొట్టు ఒడిసి పట్టి..

బొట్టు బొట్టు ఒడిసి పట్టి..