సంగారెడ్డి జోన్: కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దివ్యాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరిగా కుర్చీలు లేకపోవడంతో క్యూలైన్లలో గంటల తరబడి నిలవాల్సి వచ్చింది. అసలే వేసవి కాలం.. పైగా దివ్యాంగులు, వృద్ధులు. వారికి సరైన సదుపాయాలు కల్పించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారు. దీంతో వారు తీవ్ర అవస్థలు పడ్డారు. కాగా, ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఇతర అధికారులు అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో 57 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, డీఆర్ ఓ పద్మజరాణి, తదితరులు పాల్గొన్నారు.