
డ్రగ్స్‌ను దరి చేరనీయొద్దు
సిరిసిల్ల: విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, దరిచేరనీయొద్దని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. జిల్లా కేంద్రంలో గురువారం యాంటీడ్రగ్ డే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు, యువత పక్కా ప్రణాళిక ప్రకారం చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని సూచించారు. డ్రగ్స్ వినియోగంతో మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయన్నారు. డ్రగ్స్ వినియోగంతో శారీరక, మానసిక ఇబ్బందులు, సామాజిక రుగ్మతలు తలెత్తుతాయని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని కోరారు. జిల్లా ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగించినా.. విక్రయించినా.. తరలించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ యాంటీడ్రగ్ సోల్జర్‌గా మారాలని కోరారు.
విజేతలకు బహుమతులు
యాంటీ డ్రగ్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన ఇతర పోటీల్లోని విజేతలకు ప్రశంసాపత్రాలను కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా అందించారు. అంతకుముందు ర్యాలీలో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు గీసిన చిత్రాలు.. తయారు చేసిన పెయింటింగ్స్‌ను అభినందించారు. యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులు సంతకాలు చేశారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, సీఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, నటేశ్, మధుకర్, నాగేశ్వరరావు, ఆర్‌ఐలు రమేశ్, మధుకర్, యాదగిరి పాల్గొన్నారు.
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్లలో యాంటీ డ్రగ్ డే ర్యాలీ