రాముడిని హేళన చేసినోళ్లకు ఓటేయొద్దు | Sakshi
Sakshi News home page

రాముడిని హేళన చేసినోళ్లకు ఓటేయొద్దు

Published Fri, May 10 2024 4:00 PM

రాముడిని హేళన చేసినోళ్లకు ఓటేయొద్దు

● బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌

తిమ్మాపూర్‌: రాముడిని, అక్షింతలను హేళనచేసిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఓట్లు వేయొద్దని కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజ య్‌ సూచించారు. కరీంనగర్‌ పరిధిలోని ఆల్గునూర్‌లో ఉన్న ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో బీజేపీ మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. బీజేపీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతుందని అంటున్నవారే.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా దేవుడిపై ఒట్టు వేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో ఎంపీలుగా ఉన్న వారు వేములవాడకు ఏనాడైనా ప్రధానిని తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. దక్షిణ కాశీగా పేరున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న తొలి ప్రధాని మోదీ అన్నారు. కోడ్‌ ఉన్నప్పుడు ఎన్నికల సభలో నిధులు, హామీలు ఇవ్వకూడదనే అకల్‌ కూడా బీఆర్‌ఎస్‌ నాయకులకు లేదన్నారు.

ప్రసాద్‌ స్కీమ్‌ కోసం లేఖ రాస్తా

వేములవాడ ఆలయాభివృద్ధికి ప్రసాద్‌ స్కీంలో నిధులు మంజూరు చేయాలని ఎన్నికలు ముగియగానే కేంద్రానికి లేఖ రాస్తానని సంజయ్‌ తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తప్పించుకునేందుకే కాంగ్రెస్‌ గెలుపు కోసం బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నాయకులు ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, ఎడ్ల జోగిరెడ్డి, జి.వెంకట్‌రెడ్డి, సొల్లు అజయ్‌వర్మ, సుగుర్తి జగదీశ్వరాచారి పాల్గొన్నారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తున్నాయి

గంగాధర: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ నేతల మాదిరిగా ఫోన్‌ ట్యాపింగ్‌ డబ్బులతో ఓట్లు కొనాలనుకునే వాళ్లం తాము కాదని, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఓటుకు రూ.వెయ్యి పంచాలని కుట్రలు చేస్తున్నాయని బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. గంగాధర మండలంలోని వెంకటాయిపల్లి గ్రామ పరిధిలోని ప్రయివేటు పంక్షన్‌హాల్‌లో గురువారం చొప్పదండి నియోజకవర్గ పోలింగ్‌ బూత్‌ ఏజెంట్ల సమావేశం జరిగింది. సంజయ్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో చేసిన పనులు చెప్పుకొని ఓట్లు అడిగేవాళ్లు బిచ్చగాళ్లయితే తాము కూడా బిచ్చగాళ్లమేనని, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకుల మాదిరిగా అవినీతి సొమ్ముతో, ఫోన్‌ ట్యాపింగ్‌ డబ్బులు పంచి ఓట్లు కొనుగోలు చేయడం తమకు చేతకాదన్నారు. పోలింగ్‌ ఏజెంట్లు పోలింగ్‌శాతం పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలు పార్టీల నుంచి బీజేపీలో చేరినవారికి సంజయ్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు.

Advertisement
 
Advertisement