అన్నింటికీ రాజీనామాలా? ఈ సవాళ్లేంటి? | Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu And TDP | Sakshi
Sakshi News home page

అన్నింటికీ రాజీనామాలా? ఈ సవాళ్లేంటి?

Jul 25 2021 3:16 AM | Updated on Jul 25 2021 7:27 AM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu And TDP - Sakshi

సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు ఇటీవల కాలంలో ప్రతి చిన్న సమస్యకు రాజీనామాలకు మేము రెడీ.. మీరు కూడా రెడీనా అని తరచూ అడుగుతున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలోనూ ఇలాగే మాట్లాడారు. మీ వాళ్లను రాజీనామా చేయవద్దని ఎవరన్నా ఆపారా? మీరు రాజీనామా చేయాలనుకుంటే బంగారంగా చేయొచ్చు. ఈ సవాళ్లేంటి? 2018లో మా ఎంపీలు రాజీనామాలు చేసి, ఆమోదింప చేసుకున్నారు. నిరాహార దీక్షలు కూడా చేశారు. నిబద్ధత అంటే ఇదీ’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కడుతుంటే వైఎస్‌ జగన్‌ అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి జలదీక్ష చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో మీరూ దీక్ష చేయండని చంద్రబాబును డిమాండ్‌ చేయలేదన్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే తర్వాత ఏం జరుగుతుందో చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. ఈ సందర్భంగా సజ్జల ఇంకా ఏమన్నారంటే..

వ్యవస్థలను దుర్వినియోగం చేశారు 
► ప్రభుత్వ సలహాదారులుగా ఇంత మంది ఎందుకు అంటూ టీడీపీ నేతలు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు.  తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు వంద మందికి పైగా సలహాదారులు.. 200 నుంచి 300 మంది వరకు కన్సల్టెంట్లు ఉన్నారని తేలింది. అప్పట్లో అంత మందిని పెట్టుకుని వ్యవస్థలనే దుర్వినియోగం చేశారు.
► సీఎం జగన్‌ అలా చేయలేదు. అవసరమైన మేరకు సలహాదారులను తీసుకున్నారు. గత ప్రభుత్వంలో పరకాల ప్రభాకర్, కుటుంబరావు వంటి వ్యక్తులు సలహాదారులుగా ఉంటూ నిత్యం రాజకీయాలు మాట్లాడేవారు. నాలాంటి వాళ్లు మొదటి నుంచి వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్నారు. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. వారలా కాదు. నిత్యం డిబేట్స్‌లో పాల్గొని రాజకీయ విమర్శలు చేసేవారు.

అమరావతి అన్నది పెద్ద స్కామ్‌ 
► అమరావతిలో భూముల కుంభకోణం జరిగిందనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కోర్టులో ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ అనేదానికి ఎలా నిర్వచనం ఇచ్చుకున్నారో తెలియదు. టెక్నికల్‌ గ్రౌండ్‌ కింద రిజెక్ట్‌ చేశారేమో.. వాస్తవానికి అమరావతి అన్నది రియల్‌ ఎస్టేట్‌ మాఫియా స్కామ్‌. ఈ విషయం న్యాయస్థానానికి, టీడీపీ వారికీ తెలుసు.
► గుంటూరు – విజయవాడ మధ్య రాజధాని అంటే ఎవరైనా 20 కిలోమీటర్లు లోపలికి వెళ్లి దారికూడా సరిగా లేని మారుమూల గ్రామాల్లో భూములు కొన్నారంటే అర్థం ఏమిటి? న్యాయస్థానం తీర్పుపై కామెంట్లు చేయడం లేదు. ఈ వ్యవహారంలో ఇతర కేసులు పుష్కలంగా ఉన్నాయి. దర్యాప్తును 
ఎవరూ ఆపలేరు. తప్పు చేసిన వారంతా శిక్ష అనుభవించక తప్పదు.

పారదర్శకంగా భూముల కొనుగోళ్లు 
► విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయం గురించి వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారు. సీఎం జగన్‌ ఈ దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. విశాఖ స్టీల్‌ను నిలుపుతామన్న ఆశాభావంతో ఉన్నాం.
► ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో తల్లి వేరు చంద్రబాబు నుంచే మొదలైంది. రఘురామ, లోకేష్‌  మధ్య చాట్‌లో న్యాయమూర్తులను దుర్భాషలాడిన అంశంపై కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరిస్తుందని భావిస్తున్నాం. 
► వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు కాబట్టే టీడీపీ నేతల నోటి నుంచి ఎప్పుడూ స్కామ్‌లే వస్తాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో, భూముల కొనుగోలులో ప్రతిదీ పారదర్శకంగా జరిగింది. అవినీతి జరిగే అవకాశం లేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement