సాక్షి, చెన్నై: రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా మక్కల్ నీది మయ్యం కట్చి నేత, ఎంపీ కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులోని 234 నియోజకవర్గాలను పరిగణించి, ఒక్కో నియోజకవర్గం ఒక్కో జిల్లాగా పారీ పరంగా తీర్చిదిద్ది ∙234 మంది కొత్త జిల్లా కార్యదర్శులను నియమించనున్నారు.
ఈ నియామకాల ప్రక్రియలో భాగంగా చెన్నైలోని ఆల్వార్పేటలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో రెండు రోజుల పాటు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ కీలక నేతలుఏ.జి. మౌరియా, తంగవేలు, సెంథిల్ ఆరుముగం, చంద్రన్ తదితరులు జిల్లాల కార్యదర్శుల పదవులకు అర్హులైన వారిని ఇంటర్వ్యూ చేశారు.
గతంలో ప్రతి నియోజకవర్గానికి ఒక కార్యదర్శి ఉండేలా ఏర్పాట్లు ఉండగా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కమల్ హాసన్ భావించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి, క్షేత్రస్థాయిలో పార్టీ పనులను వేగవంతం చేయడానికి కొత్త నియామకాలు దోహదపడతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఇంటర్వ్యూల కోసం రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది ఆసక్తిగల కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఒక్కో నియోజకవర్గాన్ని తాజాగా ఒక్కో జిల్లాగా తీర్చిదిద్ది, 234 మంది జిల్లాల కార్యదర్శుల నియామకం కసరత్తు వేగవంతంచేశారు.
ఇదీ చదవండి: సీకే లావణ్యకు మేయర్ సీటు ఎలా ఇస్తారు?


