MP Kesineni Nani Vs Kesineni Chinni: కేశినేని కుటుంబంలో ‘కారు’చిచ్చు

Differences Between Keshineni Nanis Brothers - Sakshi

కేశినేని నాని సోదరుల మధ్య తారస్థాయికి చేరిన విభేదాలు

రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల మధ్య అగ్గిరాజేసిన చంద్రబాబు

బజారున పడ్డ బెజవాడ టీడీపీ రాజకీయాలు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నాని కుటుంబంలో ‘కారు’చిచ్చు రగులుకుంది. ఈ చిచ్చు పెట్టింది టీడీపీ అధినేత చంద్రబాబు కావడం గమనార్హం. దశాబ్దాలుగా ఒక్కటిగా ఉన్న కేశినేని నాని కుటుంబాన్ని రాజకీయ కుట్రలతో చంద్రబాబు అడ్డంగా చీల్చేశారు. రాష్ట్రంలో గెలిచిన ముగ్గురు టీడీపీ ఎంపీల్లో కేశినేని నాని ఒకరు. విజయవాడ పార్లమెంటరీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేశినేని నాని కొన్నాళ్లుగా పార్టీ అధి నాయకత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. బుద్దా వెంకన్న, బొండా ఉమా రాజ‘కీ’యాలకు చంద్రబాబు తలొగ్గడం, వారికే లోకేష్‌ ప్రాధాన్యం ఇవ్వడం ఇందుకు కారణం.

మరో వైపు లోకేష్‌ ఒంటెత్తు పోకడలకు చంద్రబాబు అడ్డు చెప్పలేకపోతున్నారు. దీంతో కేశినేని నాని కొన్ని రోజులుగా బీజేపీకి టచ్‌లోకి వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే అదునుగా నాని తమ్ముడు శివనాథ్‌ (చిన్ని)ను చంద్రబాబు, లోకేష్‌ ప్రోత్సహించారు. దీంతో కేశినేని కుటుంబంలో విభేదాల ముడి మరింత బిగుసుకుంది. కుటుంబ గొడవలు తారస్థాయికి చేరి కేశినాని నాని తన తమ్ముడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, అతని తమ్ముడు చిన్ని ప్రెస్‌మీట్‌ పెట్టడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 

తాడోపేడో తేల్చుకొనేందుకే.. 
కుటుంబ విభేదాలు ముదిరిన నేపథ్యంలో తాడోపేడో తేల్చుకోవాలనే ఉద్దేశంతోనే కేశినేని నాని సవాల్‌ విసిరారు. ‘గుర్తు తెలియని వ్యక్తులు నా పేరు, హోదాను ఉపయోగించుకుంటున్నారు. విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడిగా నేను వినియోగించే వీఐపీ స్టిక్కర్‌ను పోలిన నకిలీని కారుపై అంటించి దుర్వినియోగం చేస్తున్నారు’ అని పేర్కొంటూ విజయవాడ, హైదరాబాద్‌ పోలీసులకు ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో నకిలీ స్టిక్కర్‌ అంటించిన కారు నంబరును ‘టీఎస్‌ 07 హెచ్‌డబ్ల్యూ7777’గా పేర్కొన్నారు. ఇలా పోలీసులకు ఫిర్యాదు చేయడం టీడీపీలో సంచలనంగా మారింది. ఈ అంశంపై పార్లమెంటరీ సెక్రటరీ జనరల్‌కు కూడా  నివేదిస్తానంటూ ఎంపీ కేశినేని నాని ప్రకటించి చంద్రబాబుకు సవాల్‌ విసిరారు.

ఓ ఎంపీ స్టిక్కర్‌ను ఇతరులు దుర్వినియోగం చేయడాన్ని లోక్‌సభ స్పీకర్‌ తీవ్రంగా పరిగణించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తమ్ముడిపై కంటే అతని వెనక ఉండి నడిపిస్తున్న        చంద్రబాబు, లోకేష్‌ను ఢీకొట్టడమే కేశినేని నాని లక్ష్యమన్న అభిప్రాయాన్ని టీడీపీ నాయకులే వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిణామాలతో చంద్రబాబు డైలమాలో పడ్డారని సమాచారం. టీడీపీపై ఇప్పటికే తన పట్టు సడలుతోందన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో ఎంపీ నాని దిగి రాకపోతే తనపట్టు పూర్తిగా చేజారినట్టు అవుతుందన్న ఆందోళనలో చంద్రబాబు ఉన్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  

నానికి టచ్‌లోకి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు! 
ఇప్పటికే కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు కేశినేని నానికి టచ్‌లోకి వెళ్లినట్లు ఆ పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో గెలుపుపై టీడీపీ శ్రేణులకు ఏ మాత్రం నమ్మకం లేకుండాపోయింది. దీంతో ఓ అడుగు ముందుకేసి తమదారి తాము చూసుకోవాలన్న అంతర్మథనం తెలుగు తమ్ముళ్లల్లో మొదలైందని సమాచారం. కేశినేని నాని సైతం తన మార్గాన్ని సుగమం చేసుకునే చర్యల్లో ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

బుజ్జగింపుల పర్వం 
కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆందో ళన చెందిన చంద్రబాబు బుజ్జగింపుల పర్వానికి తెరదీశారు. నాని తమ్ముడు చిన్నితో హడావిడిగా ప్రెస్‌మీట్‌ పెట్టించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ‘నేను ఓ చిన్న కార్యకర్తను. చంద్రబాబు సీఎం కావడమే మా లక్ష్యం’ అంటూ చిన్ని విలేకరుల ఎదుట సన్నాయి నొక్కులు నొక్కారు. నాని తమ శత్రువు కాదని, తన సొంత అన్న అని ముక్తాయింపు ఇచ్చారు. అయితే ఇప్పటికే టీడీపీలో మొదలైన ముసలం రోజు రోజుకు మరింతగా ముదురు తోంది. టీడీపీలో వర్గ విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో ముందు ముందు చూడాల్సిందే. ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top