బతుకులు కూల్చడం బాబుకు అలవాటే | Buggana Rajendranath Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

బతుకులు కూల్చడం బాబుకు అలవాటే

Nov 18 2022 3:58 AM | Updated on Nov 18 2022 6:53 AM

Buggana Rajendranath Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్టీఆర్, హరికృష్ణ జీవితాలను కూల్చేసిన విపక్ష నేత చంద్రబాబుకు ఇళ్లు, జీవితాలను కూల్చేయడం అలవాటేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని, ఈ వయసులో ఓ వీధిరౌడీలా మాట్లాడారని మండిపడ్డారు. 73 ఏళ్ల వయస్సు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు ఎన్నికల్లో గెలిస్తేనే రాజకీయాల్లో ఉంటాననడం ఆయన నిరాశ, నిస్పృహకు అద్దం పడుతోందన్నారు.

ఎన్నికల్లో గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటానంటూ చంద్రబాబు ఎవరిని బెదిరిస్తున్నారని ప్రశ్నించారు. ఏ రాజకీయ నాయకుడైనా తాను చేసింది చెప్పుకుంటూ భవిష్యత్తులో ఏం చేయనున్నారో ప్రజలకు వివరిస్తారని, చంద్రబాబు వైఖరి మాత్రం ప్రజలు తులసి తీర్థం పోస్తే బతుకుతా అనే మాదిరిగా ఉందని వ్యాఖ్యానించారు. గురువారం సచివాలయంలో బుగ్గన విలేకరులతో మాట్లాడారు.

స్కూళ్ల మూత బాబు పాలనలోనే..
రాష్ట్రంలో 6,000 పాఠశాలలను మూసి వేశారని, నాలుగు లక్షల మంది పిల్లలు బడి మానేశారంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలాడుతున్నారు. నిజానికి 2017లో చంద్రబాబు ప్రభుత్వమే 2,906 పాఠశాలలను మూసి వేసింది. ఈ ప్రభుత్వం ఒక్క పాఠశాలను కూడా మూసి వేయలేదు. చంద్రబాబు పాలనలో 37 లక్షల మంది మాత్రమే బడి పిల్లలు ఉండగా సీఎం జగన్‌ విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో విద్యార్థుల సంఖ్య 42 లక్షలకుపైగా పెరిగింది. 

పెట్టుబడులు పెరిగాయ్‌..
పరిశ్రమల విషయంలోనూ చంద్రబాబు అసత్యాలు వల్లించారు. టీడీపీ హయాంలో ఏడాదికి సగటున పెద్ద పరిశ్రమల్లో రూ.11,994 కోట్లు పెట్టుబడులు వస్తే ఇప్పుడు సగటున రూ.13,200 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. ఇవన్నీ డీపీఐఐటీ చెప్పిన  గణాంకాలే. 

డిస్టిలరీలకు గతంలోనే అనుమతులు..
రాష్ట్రంలో ఉన్న మద్యం డిస్టిలరీలన్నీ చంద్రబాబు హయాంలో ఇచ్చినవే. ఈ ప్రభుత్వం కొత్తగా అనుమతులు ఇవ్వలేదు. 

పాల నాయుడా.. అబద్ధాల నాయుడా?
నన్ను అప్పుల మంత్రి అంటూ చంద్రబాబు విమర్శిస్తున్నారు. ఆర్థిక మంత్రులు ఎవరైనా అప్పులు చేస్తారు. ఏపీ డెయిరీని నిర్వీర్యం చేసి హెరిటేజ్‌ పెట్టి పాల వ్యాపారం చేసిన చంద్రబాబును పాల నాయుడు అని పిలవాలా? అప్పులపై అబద్ధాలు చెబుతున్నందుకు అబద్ధాల నాయుడని పిలవాలా? టీడీపీ హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల సగటున ఏటా 20 శాతం మేర అప్పులు చేశారు. మరి ఆయన్ను పెద్ద అప్పుల మంత్రి అనాలా? ఈ ప్రభుత్వం సగటున ఏడాదికి 15 శాతమే అప్పులు చేసింది. 

ముత్తాత కట్టిన ఇంట్లో ఉంటున్నా..
ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి 60 అడుగుల రోడ్డు మధ్యలో గోడ కడితే కూల్చకుండా ఏం చేస్తారు? అది కూడా పద్ధతి ప్రకారమే నోటీసులు, ఉత్తర ప్రత్యుత్తరాల తరువాతే ఆక్రమణల తొలగింపు చేపట్టారు. రోడ్ల మధ్యలో గోడలు కట్టినా, ఆక్రమించినా ఏమీ చేయకూడదా? అందుకే నా ఇళ్లు, జీవితాన్ని కూల్చివేస్తానని చంద్రబాబు బెదిరిస్తారా? 1923లో మా ముత్తాత కట్టిన ఇంట్లో ఉంటున్నా.

సొంతూరు, సొంత నియోజకవర్గంలోనే ఉంటా. చంద్రబాబుకు స్వగ్రామం నారావారి పల్లెలో ఇల్లు కూడా లేదు. ఏడాదికి ఒకసారి తల్లిని చూడటానికి వెళ్లి భారీ ప్రచారం చేసుకోవడం ఆయనకు అలవాటు. సెల్‌ఫోన్, కంప్యూటర్‌ తానే కనిపెట్టానంటూ మాట్లాడటాన్ని చూస్తుంటే వయసు మళ్లాక ఏదేదో ఆలోచనలు వస్తున్నట్లున్నాయి. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. నిజాలు మాట్లాడాలి. 

పరిమితి దాటి గత సర్కారు అప్పులు
దేశంతో పాటు అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లోనే ఉన్నాయి. కోవిడ్‌ వల్ల ఇబ్బందులు తలెత్తాయి. అప్పులు పరిమితికి లోబడే ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అనుమతికి మించి రూ.17 వేల కోట్లు ఎక్కువ అప్పులు చేసింది. ఆ అప్పులకుగానూ ఇప్పుడు రుణ పరిమితిలో కోతలు విధిస్తున్నారు. ఇది సరి కాదని కేంద్రానికి నివేదించాం. 

బాబు.. జాబు ఉత్తదే
ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ నాడు చంద్రబాబు మోసగించగా ఈ ప్రభుత్వం వచ్చాక 2.10 లక్షల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాం. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం. గత సర్కారు హయాంలో మూడు నెలలు ఆర్నెల్లకు ఒకసారి వేతనాలు చెల్లించిన దుస్థితి నెలకొంది.

కర్నూలుకు అన్యాయం చేసి..  
అధికారంలో ఉండగా కర్నూలు జిల్లాకు పలు వాగ్దానాలు చేసిన చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చకున్నా ప్రజలు సంస్కారంతో ఆయన్ను తిరగనిస్తున్నారు. హబ్‌లు, న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్, పర్యాటక పార్కులు, సోలార్‌ పవర్‌ అంటూ పలు వాగ్దానాలు చేసినా ఒక్కటీ నెరవేర్చలేదు.

ఇప్పుడు కర్నూలుకు హైకోర్టు వద్దంటూ రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు. విశాఖలో సచివాలయం వద్దంటూ ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తున్నారు. 8 రాష్ట్రాల్లో హైకోర్టులు వేరేచోట ఉన్నాయి. కర్నూలుకు హైకోర్టు రాకుండా చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు అడ్డుపడటం సిగ్గుచేటు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement