
ఫిట్‌నెస్‌పై అశ్రద్ధ
స్కూల్ బస్సుల కండీషన్ చెక్ చేయించుకోవడంలో యాజమాన్యాల నిర్లక్ష్యం
సాక్షి, పెద్దపల్లి: ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు అడ్మిషన్లు, ఫీజు వసూళ్లపై చూపిస్తున్నా శ్రద్ధ బడి బస్సులపై చూపడం లేదు. రోజూ ఉదయం, సాయంత్రం వేళలో విద్యార్థులను పికప్, డ్రాప్ చేయడం కోసం ఉపయోగించే బస్సుల భద్రతపై యాజమాన్యాలు నిర్లక్ష్యం చూపుతున్నాయి. తాజాగా రవాణాశాఖ ఫిట్‌నెస్ టెస్టుకు ఆసక్తిచూపకపోగా, వచ్చిన బస్సుల్లో అనేక నిబంధనలు ఉల్లంఘిస్తూ పిల్లల రక్షణకు సంబంధించి చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. కొంతమంది ఫిట్‌నెస్ తనిఖీ సమయాల్లో నిబంధనలు పాటిస్తున్నా, తర్వాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈనెల 12 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుండగా, ఆ లోపే విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్ ప్రక్రియ పూర్తి చేసుకోవలసి ఉన్నా సరైన స్పందన లభించడంలేదు. జిల్లావ్యాప్తంగా 273 విద్యాసంస్థల బస్సులు ఉండగా, ఇప్పటి వరకు కేవలం 125 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. ఫిట్‌నెస్ పరీక్షలకు వెళ్తే అధికారులు బస్సులను సీజ్ చేస్తారేమోననే ఉద్దేశంతోనే వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. కండీషన్ లేని బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించాల్సింది పోయి.. యాజమాన్యాలు ఇచ్చే మామూళ్లకు కక్కుర్తిపడి ఫిట్‌నెస్ సరిగాలేని బస్సులకు సైతం ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. అధికారుల తనిఖీల్లో అనేక బస్సుల్లో చాలా లోపాలు బయటపడుతుండటం గమనార్హం.
గ్రిల్స్ లేకుండా..
బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల భద్రత కోసం బస్సుకు మూడు వైపులా తప్పనిసరిగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. ము ఖ్యంగా పాఠశాలల బస్సుల్లో ప్రయాణించేది చిన్నపిల్లలు కావడంతో బస్సు కదిలేటప్పుడు కిటికీల నుంచి చేతులు బయటకు చాచకుండా గ్రిల్స్ ఏర్పా టు చేయాలి. అవి లేకుంటే ప్రయాణ సమయంలో విద్యార్థులు చేతులు బయటపెడితే ఇతర వాహనాల ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.
డ్రైవర్ వివరాలు లేకుండానే..
కొన్ని బస్సుల్లో నిబంధనల ప్రకారం డ్రైవర్ సీటు వెనుక భాగంలో అందరికీ కనిపించేలా ఉండాల్సిన డ్రైవర్ వివరాలు లేనే లేవు. అవేమీ లేకుండా బస్సులను సామర్థ్య పరీక్షలకు తీసుకొస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నామమాత్రంగా ఫైర్ ఎస్టింగిషర్లు?
అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం సంభవించి బస్సులో మంటలు చెలరేగితే వాటిని ఆర్పేందుకు ఫైర్ ఎస్టింగిషర్లు అందుబాటులో ఉండాలి. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకొని బస్సుల్లో ఫైర్ ఎస్టింగిషర్లు ఏర్పాటు చేయాలి. అయితే బస్సుల్లో ఫైర్ ఎస్టింగిషర్స్ కనిపిస్తున్నప్పటికీ, నామమాత్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిబంధనలు ఇవీ..
● వాహనం ముందు, వెనుక భాగాల్లో ‘స్కూల్ బస్సు’, ‘బడి పిల్లలున్నారు’ అన్న వ్యాక్యాలు రాయాల్సి ఉంటుంది. పాఠశాల పేరు, ఫోన్ నంబర్, పూర్తి చిరునామా బస్సుకు ఎడమవైపు వెనుక భాగంలో కనిపించేలా రాయించాలి
● బస్సు పసుపు రంగులో ఉండాలి. ఆ రంగు స్పష్టంగా కనిపించాలి.
● బస్సు వేగం గంటకు 40కిలోమీటర్లకు మించకుండా లాక్ చేయాలి. 15 ఏళ్లు నిండిన బస్సుల్లో విద్యార్థులను తీసుకెళ్లడానికి వీలులేదు.
● ఐదేళ్ల అనుభవం, 60 ఏళ్లలోపు ఉన్నవారినే డ్రైవర్లుగా నియమించుకోవాలి. ప్రతీ మూడునెలలకోసారి కంటిచూపు, రక్తపోటు, మధుమేహ పరీక్షలు చేయించాలి.
● బస్సులో ప్రాథమిక చికిత్స పెట్టే ఉంచాలి. అందులో కావాల్సిన మందులు ఎప్పటికప్పుడు సమకూర్చుకోవాలి.
● బస్సుకు కనీసం ఒక అటెండర్‌ను ఏర్పాటు చేయాలి. పిల్లలు ఎక్కేది, దిగేది డ్రైవర్‌కు స్పష్టంగా కనిపించేలా కుంభాకార అద్దాలు అమర్చాలి.
జిల్లాలో 273 బస్సులకు ఫిట్‌నెస్ చేసుకున్నవి 125 మాత్రమే..
వారం రోజుల్లో తెరుచుకోనున్న పాఠశాలలు
ఫిట్‌నెస్ లేకుంటే చర్యలు
అనుమతులు లేకుండా పాఠశాల యజమానులు బస్సులు నడిపితే చర్యలు తీసుకుంటాం. పాఠశాలల పునఃప్రారంభం వరకు తప్పనిసరిగా ఫిట్‌నెస్ చేయించుకోవాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తాం.
– రంగారావు, ఆర్డీవో

ఫిట్‌నెస్‌పై అశ్రద్ధ