● అరచేతిలో వైకుంఠం చూపిన రేవంత్‌.. ● రూ.2,500, తులం బంగారం ఇచ్చిండా.. ● రూ.2 లక్షల రుణమాఫీ చేసిండా.. ● తెలంగాణలో బీజేపీని అడ్డుకునేది బీఆర్‌ఎస్సే ● నిర్మల్‌ కార్నర్‌ మీటింగ్‌లో కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

● అరచేతిలో వైకుంఠం చూపిన రేవంత్‌.. ● రూ.2,500, తులం బంగారం ఇచ్చిండా.. ● రూ.2 లక్షల రుణమాఫీ చేసిండా.. ● తెలంగాణలో బీజేపీని అడ్డుకునేది బీఆర్‌ఎస్సే ● నిర్మల్‌ కార్నర్‌ మీటింగ్‌లో కేటీఆర్‌

Published Fri, May 10 2024 4:05 PM

● అరచ

నిర్మల్‌ శివాజీ చౌక్‌లో కేటీఆర్‌ కార్నర్‌ మీటింగ్‌కు హాజరైన జనం

నిర్మల్‌: ‘మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మీకు కరెంట్‌ కావాలా..! కాంగ్రెస్‌ కావాలా..! అని అడిగినం. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయిండ్రు. ఆరు గ్యారంటీలు అని అరచేతిలో వైకుంఠం చూపించిండు రేవంతు. ఆడబిడ్డల ఖాతాల్లో రూ.2,500, పెళ్లికి తులంబంగారం ఇస్తామన్నడు ఇచ్చిండా..? రైతురుణ మాఫీ ఇస్తామని తారీఖులు మార్చిండు తప్ప.. మాఫీ చేసిండా..? అందుకే కాంగ్రెస్‌ను నమ్మి రెండోసారి మోసపోవద్దు. పార్లమెంట్‌ ఎన్నికల్లో 13 ఎంపీ సీట్లు బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే.. మళ్లీ కేసీఆర్‌ సర్కారే వస్తుంది..’ అని నిర్మల్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని శివాజీచౌక్‌లో గురువారం రాత్రి నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. తులం బంగారం ఇస్తామని నరికిన రేవంత్‌రెడ్డి తులం ఇనుము కూడా ఇవ్వడని చెప్పారు.

పదేళ్లలో బీజేపీ ఏమిచ్చింది..

పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏమిచ్చిందని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆర్మూర్‌–నిర్మల్‌–ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌ ఇవ్వలేదని, ఆదిలాబాద్‌లో సిమెంట్‌ పరిశ్రమ తెరిపించలేదని ఆరోపించారు. నమో అంటే.. నమ్మించి మోసం చేసేటోడు..అని ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి అన్నారు. పదేళ్లకిందట తాము అధికారంలోకి రాగానే ప్రతీ ఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని, 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు.. ఇచ్చాడా.. అని ప్రశ్నించారు. గుడి కట్టినం.. ఓటేయుండ్రి అని బీజేపీ ఇదొక్కటే చెబుతుందన్నారు. అలాగైతే కేసీఆర్‌ యాదాద్రిలాంటి ఎన్నో గుడులతోపాటు కాళేశ్వరం లాంటి ఆధునిక దేవాలయాలను నిర్మించాడన్నారు. మోదీ ప్రభుత్వం పదేళ్లలో పిల్లల మనసులో మత విద్వేషం నింపారని ఆరోపించారు.

మళ్లీ వాళ్లను రానిచ్చేది లేదు..

అధికారంలో ఉన్నప్పుడు పదవులను, అధికారాన్ని అనుభవించినవాళ్లు ఇప్పుడు పార్టీ ఓడిపోగానే కాంగ్రెస్‌లోకి జంప్‌ అయ్యారని మాజీమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్‌ అన్నారు. తొమ్మిదేళ్లు మంత్రి పదవిని అనుభవించి జంప్‌ కొట్టాడన్నారు. కష్టం రాగానే పారిపోయేటోడు ఏం నాయకుడని, ఈ వయసులో అవసరమా.. అని పేర్కొన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందన్నారు. అప్పుడు తిరిగి వీరిని ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చేది లేదని స్పష్టంచేశారు. సోషల్‌మీడియాలో పంచాయితీలు అవసరం లేదని, 13 ఎంపీ సీట్లు గెలిపిస్తే మళ్లీ కేసీఆర్‌ సర్కారే వస్తుందన్నారు. ఆదిలాబాద్‌లో ఆత్రం సక్కును గెలిపిస్తే నిర్మల్‌లోనే క్యాంప్‌ ఆఫీస్‌ పెడతారని చెప్పారు.

గెలిపిస్తే.. పోరాడుతా..

ఆదిలాబాద్‌ ఎంపీగా గెలిపిస్తే.. ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించేదాకా కొట్లాడుతానని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు ఆదిలాబాద్‌ నియోజకవర్గానికి ఏం చేయలేవని ఆరోపించారు. తమ ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని చెప్పారు. ఈసారి ఎంపీగా గెలిపిస్తే.. కేంద్రంతో కొట్లాడి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్నర్‌ మీటింగ్‌లో నిర్మల్‌ జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌, మాజీమంత్రి జోగురామన్న, నిర్మల్‌, ఖానాపూర్‌ ఇన్‌చార్జిలు రాంకిషన్‌రెడ్డి, జాన్సన్‌నాయక్‌, జెడ్పీటీసీ సభ్యురాలు జానుబాయి, కోఆప్షన్‌ సభ్యుడు డాక్టర్‌ సుభాష్‌రావు, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము తదితరులు పాల్గొన్నారు.

● అరచేతిలో వైకుంఠం చూపిన రేవంత్‌.. ● రూ.2,500, తులం బంగ
1/1

● అరచేతిలో వైకుంఠం చూపిన రేవంత్‌.. ● రూ.2,500, తులం బంగ

Advertisement
 
Advertisement