మారుమూల ప్రాంతాలకు సైతం వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించగల సామర్థ్యం స్టార్‌లింక్ సొంతం. అయితే, అదే ఈ సాంకేతికత దేశ భద్రతకు సవాలుగా మారితే? అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలన్నా, కొనసాగించాలన్నా భారత ప్రభుత్వం నిర్ణయమే అంతిమమా? వినియోగదారుల వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణ భారత్‌కు ఉంటుందా? ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవ స్టార్‌లింక్‌పై ఈ ప్రశ్నలు ఇప్పుడు కీలకంగా మారాయి. తక్షశిల ఇన్‌స్టిట్యూషన్ 2026 ఏప్రిల్‌లో ప్రచురించిన ‘స్టార్‌లింక్ అండ్ రిస్క్స్ ఫర్ ఇండియా’ నివేదిక ఈ అంశాలపై పలు ఆందోళనలను లేవనెత్తింది. స్టార్‌లింక్‌పై అతిగా ఆధారపడటం భారత జాతీయ భద్రతకు, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరించింది.
వేలాది ఉపగ్రహాలతో ప్రపంచవ్యాప్త నెట్‌వర్క్
భూమికి తక్కువ ఎత్తులోని కక్ష్యలో తిరిగే ఉపగ్రహాల ద్వారా స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. సంప్రదాయ ఉపగ్రహ ఇంటర్నెట్‌తో పోలిస్తే తక్కువ ఆలస్యంతో వేగవంతమైన అనుసంధానాన్ని అందించడం దీని ప్రత్యేకత. మొబైల్ నెట్‌వర్క్‌లు, ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ అందించడం కష్టమైన మారుమూల ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఈ సేవలు ఉపయోగపడతాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాధారణ సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నా ప్రత్యామ్నాయంగా నిలవగలవు. నివేదిక ప్రకారం, 2026 ఏప్రిల్ నాటికి స్టార్‌లింక్ నెట్‌వర్క్‌లో 10,000కు పైగా క్రియాశీల ఉపగ్రహాలు ఉన్నాయి. అప్పటికి భూమి చుట్టూ కక్ష్యలో ఉన్న మొత్తం క్రియాశీల ఉపగ్రహాల్లో ఇవి దాదాపు మూడింట రెండొంతులుగా ఉన్నాయని నివేదిక అంచనా వేసింది. భవిష్యత్తులో ఉపగ్రహాల సంఖ్యను 42,000కు పెంచాలని కంపెనీ ప్రణాళికలు కలిగి ఉందని పేర్కొంది. స్పేస్‌ఎక్స్‌కు ఉన్న రాకెట్ ప్రయోగ సామర్థ్యం, భారీ స్థాయిలో ఉపగ్రహాల తయారీ వ్యవస్థ ఈ విస్తరణకు తోడ్పడుతున్నాయి.
భారత్ ఆదేశిస్తే సేవలను నిలిపివేయగలదా?
స్టార్‌లింక్ విషయంలో ప్రధాన ఆందోళన దాని నెట్‌వర్క్‌పై తుది నియంత్రణ ఎవరికి ఉంటుందనేదే. ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల కోసం భారత్ కఠినమైన నిబంధనలు రూపొందించినప్పటికీ, నెట్‌వర్క్ నిర్వహణలో స్పేస్‌ఎక్స్‌కు కీలక పాత్ర ఉంటుందని నివేదిక పేర్కొంది. జాతీయ భద్రత దృష్ట్యా ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఇంటర్నెట్‌ను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే, స్టార్‌లింక్ వెంటనే ఆ ఆదేశాన్ని అమలు చేస్తుందా అన్నది ప్రశ్న. దీనికి విరుద్ధంగా, యుద్ధం, సరిహద్దు ఉద్రిక్తతలు లేదా ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమాచార వ్యవస్థలు అత్యవసరంగా అవసరమైనప్పుడు కంపెనీ సేవలను నిలిపివేస్తే పరిస్థితి ఏమిటన్నది మరో ఆందోళన. లైసెన్సును రద్దు చేయడం వంటి నియంత్రణ చర్యలు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నప్పటికీ, సంక్షోభ సమయంలో సేవలు కొనసాగుతాయని లేదా అవసరమైనప్పుడు వెంటనే నిలిచిపోతాయని అవి పూర్తిగా హామీ ఇవ్వలేవని నివేదిక విశ్లేషించింది. అటువంటి పరిస్థితులు ఎదురైతే వాటిని ఎదుర్కొనేందుకు ముందుగానే సిద్ధం కావాలని సూచించింది.
ఉక్రెయిన్ యుద్ధం.. విదేశీ నెట్‌వర్క్‌పై ఆధారపడితే?
స్టార్‌లింక్‌పై ఆధారపడటంలోని ప్రమాదాలను వివరించేందుకు నివేదిక ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉదాహరణగా ప్రస్తావించింది. 2022 ఫిబ్రవరిలో రష్యా దాడి ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాలక్రమేణా ఆ దేశ ప్రభుత్వం, సైన్యానికి సమాచార మార్పిడిలో ఈ నెట్‌వర్క్ కీలకంగా మారింది. గతంలో ప్రచురితమైన మీడియా కథనాలను ఉటంకిస్తూ, ఎలాన్ మస్క్ భౌగోళిక పరిమితుల ద్వారా ఉక్రెయిన్‌లో కొన్ని ప్రాంతాల్లో స్టార్‌లింక్ సేవల లభ్యతను నియంత్రించిన సందర్భాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. క్రిమియా సమీపంలో సేవలను ప్రారంభించాలన్న ఉక్రెయిన్ సైనిక అభ్యర్థనను కూడా మస్క్ అంగీకరించలేదని తెలిపింది. 2025 మార్చిలో ఉక్రెయిన్ సైన్యం స్టార్‌లింక్‌పై అధికంగా ఆధారపడుతోందని, సేవలు నిలిచిపోతే యుద్ధరంగంలో తీవ్ర ప్రభావం ఉంటుందని మస్క్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నట్లు నివేదిక గుర్తుచేసింది. ఈ ఉదాహరణ భారత్‌కు కూడా కీలక పాఠమని విశ్లేషించింది. సైన్యం, భద్రతా సంస్థలు ఒకే విదేశీ సంస్థ నెట్‌వర్క్‌పై ఎక్కువగా ఆధారపడితే, ఆ సంస్థ తీసుకునే నిర్ణయాలు దేశ వ్యూహాత్మక ప్రయోజనాలను ప్రభావితం చేయవచ్చని హెచ్చరించింది.
ఇరాన్ నుంచి మణిపూర్ వరకు.. భద్రతా ఆందోళనలు
ఇరాన్‌లో సంప్రదాయ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినప్పటికీ స్టార్‌లింక్‌ను పూర్తిగా అడ్డుకోవడం కష్టమైందని నివేదిక వివరించింది. 2025 డిసెంబరు చివర్లో ప్రారంభమై 2026 జనవరిలో తీవ్రతరమైన నిరసనల సమయంలో, అక్రమ రవాణా ద్వారా దేశంలోకి చేరిన సుమారు 50,000 స్టార్‌లింక్ పరికరాలు వినియోగంలో ఉన్నట్లు నివేదిక అంచనా వేసింది. వాటిని అడ్డుకునేందుకు ఇరాన్ అధికారులు జీపీఎస్ సంకేతాలు, ఉపగ్రహ సమాచార ప్రసారానికి ఉపయోగించే కూ, కా బ్యాండ్లకు అంతరాయం కలిగించే ప్రయత్నాలు చేసినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక అంతరాయాలే ఏర్పడ్డాయని పేర్కొంది. భారత్‌లోనూ ఇలాంటి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 2024 డిసెంబరులో మణిపూర్‌లో భద్రతా బలగాలకు ఒక ఉగ్రవాద బృందం వద్ద స్టార్‌లింక్ పరికరం లభించిన ఘటనను నివేదిక ప్రస్తావించింది. దీనిపై మస్క్ స్పందిస్తూ, భారత్‌పై స్టార్‌లింక్ ఉపగ్రహ సంకేతాలు ప్రసారం కావడం లేదని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నట్లు తెలిపింది. అయినప్పటికీ, సరిహద్దు ప్రాంతాల్లో భౌగోళిక పరిమితులు ఎంత సమర్థంగా అమలవుతున్నాయన్న ప్రశ్నను నివేదిక లేవనెత్తింది. అండమాన్-నికోబార్ దీవుల్లో 2024 డిసెంబరులో అక్రమ రవాణాదారులు స్టార్‌లింక్ పరికరాలను ఉపయోగించినట్లు వచ్చిన సమాచారం కూడా ఇందులో ప్రస్తావనకు వచ్చింది.
విదేశీ సంస్థలపై ఆధారపడాలా?
అండమాన్-నికోబార్ ఘటనలో అనుమానిత పరికరాల వినియోగదారుల వివరాలు, వాటి వినియోగానికి సంబంధించిన రికార్డులను భారత అధికారులు కోరినట్లు నివేదిక తెలిపింది. అయితే, ఆ సమాచారాన్ని నేరుగా అందించడానికి స్టార్‌లింక్ నిరాకరించిందని, అమెరికా చట్ట అమలు సంస్థలు లేదా నిర్దేశిత అంతర్జాతీయ ప్రక్రియల ద్వారా అభ్యర్థించాలని సూచించినట్లు పేర్కొంది. దీనివల్ల భారత దర్యాప్తు సంస్థలకు అవసరమైన సమాచారాన్ని సకాలంలో పొందడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఒక సంస్థ సమాచారం పంచుకోవడానికి నిరాకరించడం మాత్రమే అది అక్రమ కార్యకలాపాల్లో భాగస్వామి అని నిరూపించదని కూడా స్పష్టం చేసింది. అయితే, విదేశీ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు భారతదేశంలో పనిచేస్తున్నప్పుడు, వాటి వినియోగంపై దర్యాప్తు చేయడానికి భారత చట్ట అమలు సంస్థలకు ఎంతవరకు సహకారం లభిస్తుందన్నది కీలకమైన అంశం. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణా, ఉగ్రవాద కార్యకలాపాలు లేదా ఇతర నేరాల దర్యాప్తులో అనుమానితుల వివరాలు, పరికరాల వినియోగ చరిత్ర అవసరమవుతాయి. అటువంటి సమాచారం కోసం అంతర్జాతీయ చట్టపరమైన ప్రక్రియలపై ఆధారపడాల్సి వస్తే దర్యాప్తులో జాప్యం జరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
కృత్రిమ మేధస్సు వినియోగంపై ప్రశ్నలు
స్టార్‌లింక్ వినియోగదారుల సమాచారం ఎలా సేకరిస్తుంది? దానిని ఏ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది అన్నది మరో ప్రధాన ఆందోళన. ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల ద్వారా వినియోగదారుల ప్రాంతీయ స్థానం, ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ) చిరునామాలు, సమాచార మార్పిడికి సంబంధించిన కొన్ని వివరాలు కంపెనీకి అందుబాటులో ఉండవచ్చని నివేదిక పేర్కొంది. 2026 జనవరి 15న నవీకరించిన స్టార్‌లింక్ ప్రపంచవ్యాప్త గోప్యతా విధానాన్ని కూడా ఇందులో ప్రస్తావించింది. ఆ విధానంలో కృత్రిమ మేధస్సు నమూనాల శిక్షణకు ఉపయోగించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. కంపెనీ ‘కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్’గా పేర్కొన్న ధ్వని, ఎలక్ట్రానిక్ లేదా దృశ్య సమాచారాన్ని కూడా ఇందులో చేర్చినట్లు వివరించింది. ఈ సమాచారం గుర్తింపు వెల్లడించని కొన్ని మూడో పక్షాలతో పంచుకునే అవకాశం ఉందని, వినియోగదారులు సాధారణంగా ముందస్తు ఎంపిక ద్వారానే కాకుండా అప్రమేయంగానే సమాచార భాగస్వామ్య విధానంలో భాగమవుతున్నారని నివేదిక పేర్కొంది. 2026 ఫిబ్రవరిలో స్పేస్‌ఎక్స్, మస్క్‌కు చెందిన కృత్రిమ మేధస్సు సంస్థ ఎక్స్‌ఏఐ విలీనాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎక్స్‌ఏఐ గ్రోక్ చాట్‌బాట్, ఎక్స్ సామాజిక మాధ్యమ వేదికతో సంబంధం కలిగి ఉంది. సున్నితమైన ప్రభుత్వ, వ్యూహాత్మక సమాచారానికి సంబంధించిన వినియోగాల్లో ఇటువంటి డేటా వినియోగం, మూడో పక్షాలతో సమాచార భాగస్వామ్యం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది.
ఇదీ చదవండి: రియాద్ ఎయిర్‌పోర్టుపై క్షిపణి దాడి.. 12 మంది మృతి!


