ఈ నెలలోనే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు? | Centre Likely To Convene Special Parliament Session On Delimitation And Women Reservation Bills In October, Check Details Inside | Sakshi
Sakshi News home page

ఈ నెలలోనే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?

Oct 16 2026 10:29 AM | Updated on Oct 16 2026 10:47 AM

Special Parliament Session Likely This Month on Delimitation Women Bills

పార్లమెంట్‌లో కీలక బిల్లుల ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందా?. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌), మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులపై చర్చించేందుకు ఈ నెలలోనే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బిల్లులను ఆమోదించేందుకు అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ప్రత్యేక సమావేశాల నిర్వహణపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా వెల్లడించింది. ఈ క్రమంలో డీఎంకేతో పాటు కొన్ని చిన్న ప్రతిపక్ష పార్టీలతోనూ కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. బిల్లుల ఆమోదానికి అవసరమైన మద్దతును కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, సమావేశాల తేదీలు, బిల్లులపై చర్చించే విధివిధానాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఏప్రిల్‌లోనూ ప్రయత్నం.. కానీ బిల్లులకు బ్రేక్‌
మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్‌ 16 నుంచి 18 వరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, డీలిమిటేషన్‌ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో సభ్యుల సంఖ్యను 543 నుంచి గరిష్టంగా 850కు పెంచడం, 2011 జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం వంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. అయితే, రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో అది ముందుకు సాగలేదు. దానిపై ఆధారపడిన మిగతా రెండు బిల్లులపైనా తదుపరి చర్యలు నిలిచిపోయాయి.

అభ్యంతరాలేంటంటే..
ఈ ప్రతిపాదనలపై దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని వాదించాయి. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్‌లో ఆమోదం పొందని బిల్లులను మరోసారి ముందుకు తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈసారి బిల్లులు ఆమోదం పొందుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ, గతంలో ఎదురైన సంఖ్యాబల సమస్యను కేంద్రం ఎలా అధిగమిస్తుందన్నది కీలకంగా మారింది.

అక్టోబర్‌ 26, 27 తేదీల్లో.. 
ఈ నెలాఖరులో సంవిధాన్‌ సదన్‌లో 12వ బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు, పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఇంకా ప్రొరోగ్‌ చేయలేదు. ప్రత్యేక సమావేశాలకు ముందు వారం రోజుల నోటీసు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఢిల్లీలో ఈసీ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్న వేళ.. డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రత్యేక సమావేశాలపై అధికారిక ప్రకటన, బిల్లుల పూర్తి వివరాలు వెలువడిన తర్వాతే తదుపరి కార్యాచరణపై స్పష్టత రానుంది.

ఇదీ చదవండి: మోదీ వీడియోతో బీజేపీ హడావిడి.. సెటైర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement