అరుణాచల్ ప్రదేశ్లోని ఓ రహదారిపై రాయల్ బెంగాల్ పులి సంచరిస్తున్న దృశ్యాలు వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పులి సంచారంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉండటంతో, రహదారిలోని 4 కిలోమీటర్ల పరిధిలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించారు. పులి కదలికలను పర్యవేక్షిస్తూ, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టారు.
అరుణాచల్ ప్రదేశ్లోని దిగువ దిబాంగ్ వ్యాలీ జిల్లాలో తివారిగావ్ వద్ద.. పూర్తిగా ఎదిగిన రాయల్ బెంగాల్ పులి కనిపించింది. దీంతో స్థానిక ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రోయింగ్-అనిని రహదారిలో 19వ కిలోమీటరు నుంచి 23వ కిలోమీటరు వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను అటవీ శాఖ నిషేధించింది. ఈ ప్రాంతంలో పులి కదలికలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని కూడా నియమించింది.
అప్రమత్తంగా ఉండాలని సూచన
మేహావో వన్యప్రాణి అభయారణ్యం విభాగం, రోయింగ్ డివిజనల్ అటవీ అధికారి మిటో రుమి తాజా పులి సంచారాన్ని ధ్రువీకరించారు. పరిస్థితిని గమనించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు అటవీ శాఖ బృందం రంగంలోకి దిగినట్లు తెలిపారు. రోయింగ్-అనిని రహదారిపై ప్రయాణించే స్థానికులు, పర్యాటకులు, ఇతర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం, రాత్రి వేళల్లో నిషేధిత మార్గంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించకూడదని స్పష్టం చేశారు.
పులిని చూసేందుకు రహదారిపై వాహనాలు ఆపడం, అక్కడే నిలబడి చూడటం, విహారయాత్రలు చేయడం, అనవసరంగా సంచరించడం వంటివి చేయవద్దని హెచ్చరించారు. వాహనాల్లో ప్రయాణించేవారు కిటికీలు మూసి ఉంచాలని, అవసరం లేకుండా వాహనాల నుంచి బయటకు రావద్దని సూచించారు.
ఇదీ చదవండి: ఒక్కరి కోసం సొంత దేశ ప్రజలతోనే మోదీ, షా యుద్ధం: దీప్కే
గతంలో పులి దాడిలో పోలీసు హెడ్ కానిస్టేబుల్ మృతి
ఈ ప్రాంతంలో పులుల సంచారంపై ఆందోళనలు పెరగడానికి గతంలో జరిగిన మరో ఘటన కూడా కారణమైంది. ఫిబ్రవరిలో అనిని నుంచి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్న అరుణాచల్ ప్రదేశ్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ చిక్సెంగ్ మన్పుంగ్ పులి దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
అటవీ ప్రాంతాల్లోకి ట్రెక్కింగ్ కోసం వెళ్లడం, చిన్న అటవీ ఉత్పత్తులను సేకరించడం వంటివి చేయవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. మనిషి-వన్యప్రాణుల మధ్య సంఘర్షణను నివారించేందుకు అమల్లో ఉన్న మార్గదర్శకాలను పాటించాలని కోరారు. పులి కనిపిస్తే మేహావో వన్యప్రాణి అభయారణ్యం విభాగం రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ మగోన్ లింగ్గికి 7085459372 లేదా 9436221862 నంబర్లలో సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ తెలిపింది. పులి కదలికలపై అధికారులు నిరంతరం నిఘా కొనసాగించనున్నారు. ప్రజలు ఆంక్షలను పాటించి, పులి కనిపించినప్పుడు దాని దగ్గరకు వెళ్లకుండా అధికారులకు సమాచారం అందించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.


