ఈ ‘ఫ్రెండ్‌షిప్’కి నెటిజనులు ఫిదా.. ఏకంగా 13 మిలియన్లకు పైగా వ్యూస్

మేకపిల్లపైకెక్కి కోతిపిల్ల సవారి
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోన్న వీడియో
ఒక కుటుంబానికి చెందిన వారు.. ఒకే తల్లికి జన్మించిన వారి మధ్య ప్రేమాభిమానాలు ఉండటం సహజం. కానీ ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా.. జీవితాంతం మన వెంట నిలిచేదే మైత్రి బంధం. స్నేహితుడు.. పేరులోనే ఉంది మన హితం కోరేవారని. జీవితంలో బంధువులు, తోబుట్టువులు మనల్ని విడిచిపెట్టి పోవచ్చు. కానీ ఫ్రెండ్ మాత్రం మనల్ని ఎన్నటికి విడిచిపెట్టడు. అయితే ఈ స్నేహ గుణం కేవలం మనుషులకు మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటే. నోరులేని మూగజీవుల మధ్య కూడా మైత్రి బంధం ఉంటుంది. అది కూడా వేర్వేరు జాతుల జీవిల మధ్య. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి చేతిలో బెర్రి పళ్లు పట్టుకుని.. అడవిలాంటి ప్రదేశంలో నిల్చుని తన పెంపుడు మేక పిల్లను పిలుస్తాడు. యజమాని పిలుపు విన్న వెంటనే మేక అల్లంత దూరం నుంచి పరిగెత్తుకువస్తుంది. దగ్గరకు వచ్చాకే కనిపిస్తుంది అసలు చిత్రం. ఆ మేకపిల్ల ఒంటరిగా రాదు.. దానితో పాటు తన ఫ్రెండ్ అయిన చిన్న కోతి పిల్లను కూడా తీసుకువస్తుంది. ఆ బుజ్జి కోతి పిల్ల.. ఎంచక్కా మేకపిల్ల మెడను కర్చుకుని పట్టుకుంటుంది.
(చదవండి: తిమింగలంతో దోస్తి)
యజమాని దగ్గరకు వచ్చాక మేకపిల్లతో పాటు కోతి పిల్ల కూడా బెర్రి పళ్లను నోట కర్చుకుని మేక వీపు మీద కూర్చుని తింటుంది. ఈ సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. వీటి ఫ్రెండ్‌షిప్‌కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజనులు.. ఈ మూగ జీవుల మైత్రి బంధానికి ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోని 13 మిలియన్ల మందికి పైగా చూశారు. నా జీవితంలో ఇంత అద్భుత దృశ్యాన్ని ఇప్పటివరకు చూడలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు.
Am I high right now what is happening pic.twitter.com/itBaV1XUNK
— Kristi Yamaguccimane (@wapplehouse) September 26, 2021
చదవండి: Friendship Day 2021: ముఖేశ్ మనసులో ఆనంద్‌ది చెరిగిపోని స్థానం