పామును ముద్దాడేందుకు యత్నం.. కాటేసిన విషసర్పం | UP Man Lands In ICU After Kissing Poisonous Snake | Sakshi
Sakshi News home page

పామును ముద్దాడేందుకు యత్నం.. కాటేసిన విషసర్పం

Jun 17 2025 7:40 AM | Updated on Jun 17 2025 7:40 AM

UP Man Lands In ICU After Kissing Poisonous Snake

మొరాదాబాద్‌:(యూపీ): నాగుపామును ముద్దాడుతూ తీసిన వీడియోను ఆన్‌లైన్‌లో ఉంచి సెన్సేషన్‌ చేయాలనుకున్న ఓ వ్యక్తి ప్రయత్నం బెడిసికొట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ జిల్లా హైబత్‌పూర్‌లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో బాధితుడు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 

గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్‌(50) ఓ చిన్నపాటి రైతు. గ్రామంలోని ఓ ఇంటి గోడలో ఉన్న విష సర్పాన్ని శుక్రవారం సాయంత్రం అతడు పట్టుకున్నాడు. దాన్తో విన్యాసాలు చేసిన వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టాలని అతడి ఆశ. అందుకే అందరూ చూస్తుండగా దాన్ని మెడలో వేసుకున్నాడు. ఆ తర్వాత దాని తలను నెమ్మదిగా తన నోటి వద్దకు తీసుకువచ్చాడు. ముద్దు పెట్టుకునే ప్రయత్నంలో నాలుకను బయట పెట్టాడు. అనూహ్యంగా అతడి నాలుకపై పాము కాటేసింది. 

చూస్తున్న వారంతా హాహాకారాలు చేశారు. కొద్దిసేపటికే అతడు సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉన్న జితేంద్ర కుమార్‌ పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. స్టంట్‌ సమయంలో జితేంద్ర కుమార్‌ మద్యం మత్తులో ఉన్నాడని, పొగతాగుతూనే పాముతో ఆటలాడాడని స్థానికులు అంటున్నారు. కాటేసిన వెంటనే జితేంద్ర కుమార్‌ పామును వదిలేయడంతో అది పొదల్లోకి జారుకుందని చెబుతున్నారు. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement