Kuwait: భారతీయ మృతులపై నో క్లారిటీ: విదేశాంగ శాఖ | Kuwait Fire: Mos MEA Kirti Vardhan Leaves For Kuwait Going There To See The Situation, Details Inside | Sakshi
Sakshi News home page

Kuwait Fire Tragedy: భారతీయుల మృతులపై ఇంకా రాని స్పష్టత!

Published Thu, Jun 13 2024 7:29 AM | Last Updated on Thu, Jun 13 2024 9:06 AM

Kuwait Fire: Mos MEA Kirti Vardhan Leaves for Kuwait going there to See the Situation

దుబాయ్‌: కువైట్‌ ఘోర అగ్నిప్రమాదం మృతుల లెక్కపై స్పష్టత రావాల్సి ఉంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 49 మంది చనిపోతే, అందులో 41 మంది భారతీయులే ఉన్నారు. అయితే మృతుల సంఖ్యపై కచ్చితత్వం.. అందులో భారతీయులు ఎందరు?.. వాళ్ల పేర్లు, స్వస్థలం .. ఇతర వివరాలు ఏంటి? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ మేరకు అగ్ని ప్రమాద సహాయ చర్యలను స్వయంగా పర్యవేక్షించడానికి విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తివర్దన్‌ సింగ్‌ కువైట్‌ బయల్దేరారు. 

ప్రధాని  నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు తాను అక్కడికి వెళ్తున్నానంటూ కువైట్‌కు బయలుదేరే ముందు కీర్తివర్ధన్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

‘కువైట్‌ ప్రమాదంపై ప్రధాని మోదీతో బుధవారం సాయంత్రం సమావేశం అయ్యాం. అక్కడి చేరుకోగానే అక్కడ నెలకొన్న పరిస్థితులపై స్పష్టత వస్తుంది. ప్రమాదంలో చాలా మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి  గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. మృతదేహాలను గుర్తుపట్టడానికి డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. 

ఎయిర్‌ఫోర్స్‌ విమానం కూడా సిద్ధంగా ఉంది. మృతదేహాలను గుర్తించిన వెంటనే ఎయిర్‌ పోర్స్‌  విమానంలో మృతదేహాలను భారత్‌కు తరలిస్తాం. ఇప్పటివరకు అందినసమాచారం మేరకు 49 మంది మృతి చెందారు. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు’ అని అన్నారు.

గల్ఫ్‌ దేశం కువైట్‌లో బుధవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుక్ను ఘటనలో ఏకంగా 49 మంది మరణించారు. వీరిలో ఏకంగా 40 నుంచి 42 మంది భారతీయులేనని సమాచారం. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. బాధితుల్లో ఎక్కువమంది కేరళకు చెందినవారని సమాచారం. తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఉపాధి కోసం వలస వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం తీవ్ర విషాదానికి గురిచేసింది. కువైట్‌ దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లో మాంగాఫ్‌ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. తొలుత వంటగది నుంచి మంటలు వ్యాపించినట్లు తెలియజేశారు. ఈ భవనంలో 200 మందికిపైగా భవన నిర్మాణ కార్మికులు నివసిస్తున్నారు.

వివిధ దేశాల నుంచి వలస వచ్చిన వీరంతా ఎన్‌బీటీసీ గ్రూప్‌ అనే నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. కార్మికుల వసతి కోసం ఈ సంస్థ సదరు భవనాన్ని అద్దెకు తీసుకుంది. మృతులు 20 నుంచి 50 ఏళ్ల లోపు వారేనని అరబ్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో కార్మికులు నిద్రలో ఉన్నారు. దట్టమైన పొగ వ్యాపించింది. దాన్ని పీల్చడం వల్లే ఎక్కువ మంది మరణించారు.

అగ్నిప్రమాదంలో చాలామంది భారతీయులు మరణించడంపై కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ +965–65505246 ఏర్పాటు చేసింది. సహాయం, సమాచారం అవసరమైన వారు తమను సంప్రదించాలని సూచించింది. బాధితులకు అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించింది.

కువైట్‌ మొత్తం జనాభాలో భారతీయులు 21 శాతం(10 లక్షలు) ఉంటారు. కువైట్‌లోని మొత్తం కార్మికుల్లో 30 శాతం మంది(దాదాపు 9 లక్షలు) భారతీయులే కావడం విశేషం. అగ్నిప్రమాదంలో మరణించినవారికి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మాంగాఫ్‌ ప్రాంతంలోని ఘటనా స్థలాన్ని భారత రాయబారి ఆదర్శ్‌ స్వాయికా సందర్శించారు. గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న భారతీయులను పరామర్శించారు. తగిన సాయం అందిస్తామని భరోసా కల్పిచారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే విషయంలో కువైట్‌ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. బాధితుల్లో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా, మరికొందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వివరించారు.  

మాంగాఫ్‌ భవన యజమానిని తక్షణమే అరెస్టు చేయాలని కువైట్‌ ఉప ప్రధానమంత్రి షేక్‌ ఫహద్‌ అల్‌–యూసుఫ్‌ అల్‌–సబా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికులకు తగిన భద్రత కల్పించని భవన నిర్మాణ కంపెనీ యజమానికి సైతం అరెస్టు చేయాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కంపెనీ యాజమాన్యంతోపాటు భవన యజమాని దురాశ వల్ల అమాయకులు బలయ్యారని ఆయన విమర్శించారు. ఒకే భవనంలో పెద్ద సంఖ్యలో కార్మికులు నివసించడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. ఇలాంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అగ్నిప్రమాదానికి బాధ్యులుగా గుర్తించి పలువురు అధికారులను కువైట్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement