జంతర్‌ మంతర్‌ ఇక చూ మంతర్‌  | Delhi historic observatory turned protest hub | Sakshi
Sakshi News home page

జంతర్‌ మంతర్‌ ఇక చూ మంతర్‌ 

Oct 13 2026 6:31 AM | Updated on Oct 13 2026 6:31 AM

Delhi historic observatory turned protest hub

ఉద్యమ వేదికపై నిషేధాజ్ఞలు

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ అంటే ఒక ఆశ. భారతదేశంలో ఇంకా ప్రజాస్వామ్యం ఉందని నమ్మడానికి నిలువెత్తు సాక్ష్యం. ఒకప్పుడు కాలాన్ని, ఖగోళ వస్తువుల కదలికలను అంచనావేసే ప్రయోగశాలగా ఉన్న జంతర్‌మంతర్‌.. దశాబ్ద కాలంగా దేశ సామాజిక పరిస్థితులను, మారుతున్న ప్రజాభిప్రాయాలను తెలిపే వేదికయ్యింది. 

తాజాగా సీఈసీకి వ్యతిరేకంగా నిరసనలు, పేపర్‌ లీకేజ్‌ ఆందోళనలు, అంతకుముందు నిర్భయ ఘటనపై వెల్లువెత్తిన ఉద్యమం, ప్రభుత్వాలను మార్చేసిన అన్నా హజారే నిరాహార దీక్ష.. ఇంకా ఎన్నో ఆందోళనలకు, ఎన్నో నిరసన గళాలకు గొంతుకయ్యింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని అనామక, అమాయక ప్రజల అసమ్మతిని తెలిపే వేదికయ్యింది. అంతటి చారిత్రాత్మక ప్రదేశంపై ఇప్పుడు ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. నిరసన ప్రదేశాల జాబితా నుంచి ఢిల్లీ పోలీసులు తాజాగా తొలగించింది. దీంతో మరోసారి దేశవ్యాప్త చర్చకు కారణమైన ఆ ప్రాంత ప్రాశస్త్యం గురించి ఓసారి చూద్దాం.. 

ఖగోళ వేదశాలగా.. 
జంతర్‌మంతర్‌ ప్రస్తుత ఆధునిక భారత రాజకీయాల్లో పోషిస్తున్న పాత్ర కంటే చాలా పురాతనమైన చరిత్ర ఉంది. 1724లో జైపూర్‌ మహారాజు సవాయ్‌ జైసింగ్‌ ( జీజీ) ఖగోళ శాస్త్రంపై ఆసక్తితో కాలక్రమాన్ని, గ్రహాల స్థితిగతులను ఖచ్చితంగా గణించడానికి ఇక్కడ ఖగోళ వేదశాలను నిర్మించారు. దీంతోపాటు జైపూర్, ఉజ్జయిని, వారణాసి, మధురలలోనూ ఏర్పాటు చేశారు. వేదశాల బయట ఉన్న రహదారికి కొన్ని శతాబ్దాల తర్వాత గుర్తింపు వచ్చింది. దీనికో సుదీర్ఘ చరిత్ర ఉంది.  
బోట్‌క్లబ్‌ మైదానాల నుంచి..  

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ప్రజల అసమ్మతిని తెలపడానికి ఇండియా గేట్, విజయ్‌ చౌక్‌ సమీపంలోని బోట్‌ క్లబ్‌ మైదానాలు ఢిల్లీలో భారీ ప్రదర్శనలకు ప్రధాన వేదికలుగా కొన్ని దశాబ్దాల పాటు ఉన్నాయి. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రజలు రోజుల తరబడి ఎర్రకోట వెనుక శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఉండేవారు. 

1988 ఇదే అక్టోబర్‌లో రైతు నాయకుడు మహేంద్ర సింగ్‌ టికాయత్‌ బోట్‌ క్లబ్‌ మైదానాల్లో భారీ సభ నిర్వహించారు. వేలాది మంది రైతులు తమ పశువులతో సహా వచ్చి ఆ ప్రాంతంలో ఉండి.. తమ డిమాండ్లను పరిష్కరించాలని అప్పటి రాజీవ్‌ గాంధీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వంలోని కీలక కార్యాలయాలకు ఇది దగ్గరగా ఉండటం, ఆందోళనలతో ప్రజల శాంతిభద్రతలపై బోట్‌క్లబ్‌ను నిరసన వేదికగా ఉండటంపై పునరాలోచనలో పడ్డ ప్రభుత్వం.. ఇక్కడ ప్రదర్శనలపై ఆంక్షలు విధించింది. 

ప్రత్యామ్నాయంగా జంతర్‌మంతర్, రామ్‌లీలా మైదానం..  
జంతర్‌ మంతర్‌ ఒక ప్రత్యామ్నాయ ప్రదేశంగా చూపింది. 5,000 మంది వరకు గుమిగూడే సమావేశాల కోసం జంతర్‌ మంతర్‌ను కేటాయించగా, అంతకంటే పెద్ద ప్రదర్శనలను రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించాల్సిందిగా సూచించింది. ఇలా ఏళ్లు గడిచేకొద్దీ, జంతర్‌ మంతర్‌ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, కారి్మక సంఘాలు, రైతులు, కార్యకర్తలు, సాధారణ పౌరులకు ప్రధాన నిరసన కేంద్రంగా మారింది. ఇక్కడ జరిగిన తొలి, ముఖ్య ప్రదర్శనల్లో ఒకటి.. 1993లో జరిగిన‘జైల్‌ భరో’. ఆనాటి ప్రభుత్వ ఆర్థిక విధానాలకు, మతతత్వానికి వ్యతిరేకంగా నిరసన కోసం 33 సంస్థలు ఏకమయ్యాయి. ఈ ప్రదర్శనలో దాదాపు 25,000 మంది పాల్గొన్నారు. 

జన్‌ లోక్‌పాల్‌ బిల్లుకోసం.. 
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, దేశవ్యాప్త అవినీతిని అరికట్టడానికి ‘జన్‌ లోక్‌పాల్‌ బిల్లు’డిమాండ్‌ చేస్తూ 2011లో అన్నా హజారే నేతృత్వంలో జరిగిన ఐదు రోజుల నిరాహార దీక్షకు కేంద్రంగా మారింది. చట్టాన్ని రూపొందించడం కోసం ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అంగీకరించడంతో హజారే తన నిరాహార దీక్షను విరమించారు. దీంతో రాజకీయ జవాబుదారీతనం కోసం సాగే ప్రజా ఉద్యమాలకు 
జంతర్‌ మంతర్‌ కేంద్ర భిందువైంది. 

నిర్భయ ఘటనతో..  
2012 డిసెంబర్‌లో ‘నిర్భయ ఘటన’తరువాత.. నిరసన ప్రదర్శనలకు ఒక ముఖ్యమైన ప్రదేశంగా మారింది. ఢిల్లీలో కదులుతున్న బస్సులో సామూహిక హత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం చేయాలని, మహిళలను రక్షించడానికి మరింత కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ వేలాది మంది నిరసనకారులు, ముఖ్యంగా యువత, వీధుల్లోకి వచ్చారు. 2014లో, అరుణాచల్‌ ప్రదేశ్‌ విద్యార్థిని నిడో తానియా మరణం తర్వాత కూడా నిరసనలు జరిగాయి. 2017లో, వ్యవసాయ సంక్షోభాన్ని ఎత్తిచూపుతూ తమిళనాడు రైతులు 41 రోజుల పాటు నిరసన చేపట్టారు. 2023లో అప్పటి రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా ధర్నా జరిగింది. మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధిస్తున్నారని, ఆయనను అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఒలింపిక్‌ విజేతలతో సహా ప్రముఖ రెజ్లర్లు ఆందోళన చేపట్టారు.  

పేపర్‌ లీకేజీలపై..  
నీట్‌–యూజీ పేపర్‌ లీకేజీపై 2024లో విద్యార్థులు గళమెత్తారు. 2026లో మరో నీట్‌–యూజీ పేపర్‌ లీక్‌ వివాదం నేపథ్యంలో ఈ పరీక్షా విధానంపై దేశ్యాప్త చర్చ జరిగింది. దీనిపై జంతర్‌ మంతర్‌ ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ఆధ్వర్యంలో జరిగిన భారీ ఆందోళనకు చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడం అందరికీ తెలిసిందే.  

గతంలోనూ నిషేధం... 
ప్రభుత్వాలను కుదిపేసిన ఆందోళనలకు సాక్షీభూతంగా ఉన్న జంతర్‌మంతర్‌పై నిషేధం విధించడం కొత్తేం కాదు. నిరసనలు పెరగడం, ఆ ఆందోళనలతో నెలకొనే శబ్దం, ఆ తరువాత ఏర్పడే చెత్త, నిరసనకారులు ఎక్కువకాలం ఉంటుండంతో ఏర్పడుతున్న తాత్కాలిక నిర్మాణాలపై ఆందోళన పలుమార్లు వ్యక్తమైంది. దీంతో 2017 అక్టోబర్‌ 5న జంతర్‌ మంతర్‌ వద్ద ప్రజల నిరసనలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ నిషేధం విధించింది. 

ఈ సంపూర్ణ నిషేధాన్ని సుప్రీంకోర్టు 2018 కొట్టేసింది. పూర్తి నిషేధం పరిష్కారం కాదని, పౌరుల నిరసన హక్కును, స్థానికుల శాంతిభద్రతల హక్కును సమతుల్యం చేస్తూ ప్రదర్శనలను నియంత్రించడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. పెద్ద సమావేశాలను రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించుకోవచ్చని సూచించింది. జంతర్‌మంతర్‌ వద్ద నిరసనకారుల సంఖ్యను పరిమితం చేసింది. లౌడ్‌స్పీకర్ల వాడకాన్ని నియంత్రించింది. దీర్ఘకాలిక శిబిరాలను నివారించాలని, స్థానికులకు ఇబ్బంది కలగకుండా నిరసన కారులు తమ హక్కులను వినియోగించుకోవాలని తీర్పులో పేర్కొంది. 

గొంతు నొక్కేయడమే.. 
‘జంతర్‌ మంతర్‌ దేశంలో అసమ్మతికి, అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా నిలబెట్టే పౌరుల హక్కుకు ప్రతీక. నిర్భయ సామూహిక అత్యాచారం కేసు దేశాన్ని కుదిపేసినప్పుడు నేను టీనేజర్‌నే. జాతీయ రాజధానిలో ఆ ఘోరం గురించి తెలిసి కలత చెందాను. నిరసనల్లో భాగం కావాలనుకున్నా. జంతర్‌మంతర్‌ వెళ్లి నా వంతుగా గళం విప్పాను. ఇప్పుడు జంతర్‌మంతర్‌ను నిషేధించడమంటే ప్రజల అసమ్మతి గొంతు నొక్కేయడమే’ 
 – డాక్టర్‌ ప్రణవ్‌ రాజ్‌ సింగ్, ఢిల్లీ నివాసి  

అణచివేత చర్య.. 
‘ప్రభుత్వ కీలక కార్యాలయాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రజలు తమ నిరసనలు తెలపడానికి , ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టడానికి సరైన ప్రదేశం. నేను ఈ వేదిక నుంచే అన్నా హజారే ఉద్యమంలో పాల్గొన్న. దీని జాబితా నుంచి∙తొలగించడమంటే అసమ్మతి గళాలపై అణచివేత చర్యే. ’    
 – రాణి శర్మ  

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement