
అంగన్‌వాడీలకుమహర్దశ
కేంద్రాలపై పక్కా నిఘా
రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికత ఉన్న 5జీ నెట్‌వర్క్‌తో కూడిన రూ.20 వేల విలువైన ట్యాబ్‌లను టీచర్లకు అందించాలని నిర్ణయించింది. అంగన్‌వాడీ కేంద్రాలకు సంబందించి సమగ్ర వివరాలు రోజు వారిగా నమోదు చేయడానికి, చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు, కిషోర బాలికలకు అందించే పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి ఎంతో ఉపయోగపడనున్నాయి. నూతన ట్యాబ్‌లు వినియోగించి ప్రభుత్వం సరఫరా చేసే సరుకులు పక్కదారి పట్టకుండా కేంద్రాలపై పక్కా నిఘా ఏర్పాటు చేయనున్నారు.
కోస్గి: గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పూర్వప్రాథమిక విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. 2025–26 విద్యా సంవత్సరంలోనే ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి పక్కా భవనం నిర్మాణంతోపాటు అన్ని కేంద్రాల్లో చిన్నారులకు మౌళిక వసతులు క ల్పించాలని, ప్రభుత్వం అందించే పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా టీచర్లకు 5జీ నెట్‌వర్క్‌తో ఉన్న ట్యాబ్‌లు అందించాలని మాతాశిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అరకొర వసతుల మధ్య అద్దె భవనాలలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు మహర్ధశ పట్టనుంది.
పక్కా భవనాలు, మౌళిక వసతుల ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి పక్కా భవనం నిర్మించడంతోపాటు ఒక్కో కేంద్రంలో తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఇతర మౌళిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ విద్యా సంవత్సరంలోనే భవన నిర్మాణాలతోపాటు మౌళిక వసతుల ఏర్పాటు పూర్తి చేయాలని శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో నారాయణపేట, మద్దూర్, మక్తల్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 649 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 55 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 422 కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో అరకొర వసతులున్న అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
మారనున్న రూపురేఖలు
జిల్లాలో 90 శాతం అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు, కనీస సౌకర్యాలు లేకుండానే కొనసాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 704 అంగన్‌వాడీ కేంద్రాలున్నప్పటికి 422 కేంద్రాలకు సొంత భవనాలు లేకుండా అరకొర వసతులున్న భవనాల్లో కొనసాగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరుగుదొడ్లు లేకపోవడంతో చిన్నారులను ఆరుబయటకు తీసుకెళ్తున్న దుస్థితి. ఇళ్ల మధ్య కేంద్రాలున్న చోట కాలనీవాసులకు అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులకు మధ్య వాగ్వాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ నూతన భవనాలు నిర్మించడంతోపాటు మౌళిక వసతులు కల్పించనుండటంతో అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు మారతాయని టీచర్లు, చిన్నారుల తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మినీ అంగన్‌వాడీ కేంద్రాలు 55
సొంత భవనాలు లేని కేంద్రాలు 422
జిల్లా వివరాలిలా..
ఐసీడీఎస్ ప్రాజెకులు
నారాయణపేట, మక్తల్, మద్దూర్
సొంత భవనాలు, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం
ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి పక్కా భవనం
మినీ అంగన్‌వాడీ కేంద్రాలు
ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్
టీచర్లకు 5జీ నెట్‌వర్క్‌తో కొత్త ట్యాబ్‌లు
జిల్లాలో 422 కేంద్రాలకు సొంత భవనాలు కరువు
అంగన్‌వాడీ కేంద్రాలు
649

అంగన్‌వాడీలకుమహర్దశ