
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచాలి
తాడూరు: ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచేలా విద్యాబోధన ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం తాడూరు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంతో పాటు మేడిపూర్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకోవడంతో పాటు ఏఐ బోధనా ప్రక్రియను పరిశీలించారు. అదే విధంగా అటల్ టింకరింగ్ సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటుకు అవసరమైన గదులను కలెక్టర్ పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. మేడిపూర్ పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో సాధించిన ఫలితాలపై ఆరా తీశారు. కేజీబీవీలో విద్యాబోధనను గమనించారు. పాఠ్యపుస్తకాల పంపిణీ, బోధనా లక్ష్యాలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఏఐ విద్యను సమర్థవంతంగా అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలన్నారు. విద్యార్థుల భోజనం తయారీకి వినియోగించే పప్పుదినుసులు, వంట నూనె, బియ్యం ఇతర సామగ్రి నాణ్యతగా ఉండాలన్నారు. మెనూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదే విధంగా సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను ప్రజలకు వివరించి.. విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలన్నారు. కాగా, కేజీబీవీలో నెలకొన్న సమస్యలను ప్రత్యేకాధికారిణి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇంటర్‌లో 80 మందికి గాను 70 మంది చేరినట్లు తెలిపారు.