
చెంచుల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం
మన్ననూర్: చెంచులు ఆర్థికాభివృద్ధి సాధించే వరకు వారికి వెన్నంటి ఉంటూ పోత్సహిస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఇందిర సౌర గిరి జల పథకంలో భాగంగా చెంచుల వ్యవసాయ పొలాల్లో తవ్వుతున్న బోరుబావులను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని.. ఈ నెల 18న కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించామన్నారు. అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో చెంచులు సాగు చేసుకుంటున్న ఆర్‌ఓఎఫ్‌ఆర్, పట్టా భూముల్లో బోర్లు తవ్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. బోరుబావులు తవ్విన తర్వాత స్ప్రింక్లర్లు, పంపుసెట్లకు సౌర విద్యుత్ అందిస్తామని.. ప్రస్తుత విధానాలకు అనుకూలంగా ఉద్యాన, వాణిజ్య పంటలు పండించే ఏర్పాట్లు కూడా చేస్తామని వివరించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ, డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డి, ఆర్డీఓ మాధవి, గ్రౌండ్ వాటర్ ఏడీ దివ్యజ్యోతి, డీటీడీఓ ఫిరంగి, డీపీఓ మోహన్‌రావు, జిల్లా ఉద్యాన అధికారులు జగన్, వెంకటేష్, ఐటీడీఏ ఏఓ జాఫర్ హుస్సేన్, డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌అండ్‌బీ డీఈ జలంధర్, తహసీల్దార్ శైలేంద్రకుమార్, ఎంపీడీఓ వెంకటయ్య, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.