
పక్కాగా ‘భూ భారతి’ నిర్వహణ
నాగర్‌కర్నూల్: భూ భారతి చట్టంపై రెవెన్యూ అధికారులందరూ అవగాహన కలిగి ఉండాలని, అవగాహన సదస్సులు పక్కాగా నిర్వహించాలని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో భూ భారతి చట్టంపై రెవెన్యూ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. 13 నెలల పాటు 18 రాష్ట్రాల చట్టాలను పరిశీలించి రూపొందించిన చట్టం భూ భారతి అన్నారు. రెవెన్యూ ఉద్యోగులు చట్టం గురించి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని, ధరణిలోని లోపాలను భూ భారతి పరిష్కరిస్తుందని చెప్పారు. క్షేత్రస్థాయిలోనే భూ సమస్యలు పరిష్కారం అయ్యేలా చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు. రికార్డులలో తప్పుల సవరణ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసేందుకుగాను ముందుగా భూముల సర్వే, మ్యాప్ తయారీ, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థ భూ భారతిలో కీలక అంశాలని వెల్లడించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన భూ భారతిని ప్రజల్లోకి విస్లృతంగా తీసుకెళ్లాలని, రైతుసంఘాల నాయకులు, సభ్యులను కూడా సదస్సులో భాగస్వామ్యం చేయాలని, చట్టంలోని ప్రాధాన్యత అంశాలు ప్రజలకు అర్థమయ్యేలా కరపత్రంపై ముద్రించాలన్నారు. నకిలీ విత్తనాల తయారీ వ్యవస్థను రూపుమాపేందుకు కలెక్టర్ కృషి చేయాలని, నకిలీ బీటీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులను వారి బారి నుంచి కాపాడాలని కోరారు. న్యాయవాది, రైతు కమిషన్ సభ్యుడు సునీల్ భూ భారతిలోని సెక్షన్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ వివరించారు. కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ.. ప్రజాపాలనలో చారిత్రక మార్పు తేవడానికే ప్రభుత్వం కొత్త ఆర్వోఆర్ చట్టం తీసుకొచ్చిందన్నారు. ఏప్రిల్ 17 నుంచి 30 వరకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ సిబ్బంది, అధికారులు కార్యక్రమంలో నిమగ్నమై భూ సమస్యలు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు కేవీ నరసింహారెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, రాములునాయక్, మరికంటి భవాని, అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి చంద్రశేఖర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రైతుల సలహాలు, సూచనలు స్వీకరిస్తాం
తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమకమిషన్ చైర్మన్ కోదండరెడ్డి