‘భరోసా’గా షీటీం | - | Sakshi
Sakshi News home page

‘భరోసా’గా షీటీం

Mar 8 2025 12:50 AM | Updated on Mar 8 2025 12:49 AM

అత్యాచార, పోక్సో బాధితులకు అండగా నిలుస్తున్న కేంద్రం

న్యాయ, వైద్యపరమైన సేవలు అందిస్తున్న సిబ్బంది

షీటీంతో కలిసి

సమన్వయంతో ముందుకు..

ఏడాది కాలంలో 89 కేసుల పరిష్కారం

నాగర్‌కర్నూల్‌ క్రైం: సమాజంలో ప్రతిరోజు మైనర్లతోపాటు మహిళల పట్ల ఎక్కడో ఒకచోట వేధింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. వేధింపులకు గురైన చాలామంది తమ బాధను బయటకు చెప్పుకోలేక మదనపడుతుంటే.. మరికొందరు ధైర్యం చేసి ముందుకు వచ్చి వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తుండటంతో జిల్లా పోలీస్‌ శాఖలోని షీటీం, భరోసా కేంద్రం వారికి అండగా నిలిచి న్యాయం జరిగేలా చూస్తుంది. ముఖ్యంగా అత్యాచార ఘటనల్లో బాధితులకు వెంటనే న్యాయం చేయడంతోపాటు సంబంధిత వివరాలు బయటకు రాకుండా.. వారిలో ఆత్మస్థైర్యం నింపేలా భరోసా కేంద్రం కృషిచేస్తుంది. మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులపై సత్వరమే స్పందించేందకు గతేడాది ఫిబ్రవరిలో భరోసా కేంద్రం ఏర్పాటు చేశారు. షీటీంను సంప్రదించిన వారికి భరోసా కేంద్రం ద్వారా న్యాయం జరిగేలా చూస్తున్నారు.

వివరాలు గోప్యంగా..

జిల్లాకేంద్రలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రంలో ఇప్పటి వరకు 90 కేసులను పరిష్కరించారు. ఇందులో చిన్నారులపై జరిగిన 76 పోక్సో, 9 అత్యాచార, 5 ఇతర కేసులు ఉన్నాయి. లైంగిక వేధింపులకు గురైన చిన్నారులతోపాటు మహిళల వివరాలను గోప్యంగా ఉంచడంతోపాటు బాధితులను పోలీస్‌స్టేషన్లు, ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకువెళ్లకుండా భరోసా కేంద్రంలోనే వివరాలు సేకరించి వారికి న్యాయం జరిగేలా చూస్తున్నారు. వైద్య సేవలను సైతం అందిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 6న ప్రారంభించిన భరోసా కేంద్రం ద్వారా లైంగిక వేధింపులతోపాటు మహిళలపై జరిగే దాడుల నుంచి రక్షణ పొందేలా 43 అవగాహన సదస్సులు నిర్వహించారు. భరోసా కేంద్రం నిధుల నుంచి పలువురు బాధితులకు ఆర్థికంగా చేయూతనందిస్తున్నారు.

నిరంతరం అందుబాటులో..

జిల్లాలోని 22 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులకు భరోసా కేంద్రలో సేవలు అందించి న్యాయం అందించేందుకు ఏడుగురు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారు. ఇందులో ఒక మహిళా ఎస్‌ఐ, భరోసా కోఆర్డినేటర్‌, ముగ్గురు లీగల్‌ సపోర్ట్‌ పర్సన్లు, ఏఎన్‌ఎం, రిసెప్షనిస్టు పనిచేస్తున్నారు.

అవగాహన కార్యక్రమాలు..

మహిళలకు అండగా షీటీం నిరంతరం పనిచేస్తుంది. మహిళలపై జరుగుతున్న వేధింపులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేధింపులను అడ్డుకునేందుకు బస్టాండ్లు, రద్దీ ప్రాంతాలల్లో నిఘా ఉంచుతున్నారు. జిల్లాలో ఎక్కువగా షీటీంను సంప్రదిస్తున్న కేసుల్లో వేధింపులవే ఉంటున్నాయి. వేధింపులకు గురైన వారు నేరుగా షీటీంను సంప్రదిస్తే నిందితులపై కేసులు నమోదు చేయడంతోపాటు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. షీటీంకు గతేడాది 166 ఫిర్యాదులు రాగా.. 59 ఎఫ్‌ఐఆర్‌లు, 22 ఈ–పెట్టీ కేసులు నమోదు చేశారు. అలాగే 163 అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 34 ఫిర్యాదులు రాగా.. 10 ఎఫ్‌ఐఆర్‌లు, 2 ఈ–పెట్టీ కేసులు నమోదు చేయడంతోపాటు 37 అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు.

సత్వరం స్పందిస్తాం..

మహిళల భద్రత కోసం పోలీస్‌ శాఖ నిరంతరం కృషి చేస్తుంది. లైంగిక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు సత్వరమే న్యాయం జరిగేందుకు భరోసా కేంద్రం కృషి చేస్తుంది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన భరోసా కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 90 మందికి న్యాయం జరిగేలా చూసాం. ఎవరైనా లైంగిక వేధింపులకు గురైతే న్యాయం కోసం డయల్‌ 100, 1098, 181ను సంప్రదించాలి. – గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, ఎస్పీ

‘భరోసా’గా షీటీం 1
1/1

‘భరోసా’గా షీటీం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement