ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటికి తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. సొరంగం వద్ద సహాయక చర్యలను పరిశీలించిన ఆయన.. తిరుగు ప్రయాణంలో మన్ననూర్ వద్ద విలేకరులతో మాట్లాడారు. గల్లంతైన కార్మికుల ఆచూకీ తెలుసుకునేందుకు రెస్క్యూ బృందాలతో సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు చెప్పారు. సొరంగంలో మరో 5 మీటర్ల వరకు పేరుకుపోయిన బురద మట్టిని తొలగించాల్సి ఉందన్నారు. మంగళవారం కన్వేయర్ బెల్టును పునరుద్ధరించి 800 నుంచి 900 టన్నుల బురదను బయటికి పంపించినట్లు వివరించారు. సొరంగంలో మరోసారి ప్రాణనష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు అంతర్జాతీయ నిపుణులు లేదా రోబోలతో సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉందన్నారు.