
కొల్లాపూర్: స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజయ్య సమక్షంలో బుధవారం తైబజార్ వేలం పాట నిర్వహించారు. వేలంలో ఎనిమిది మంది పాల్గొన్నారు. మొదట మున్సిపాలిటీ నిర్ణీత ధర రూ.25 లక్షలు ప్రకటించగా పోటీదారులు వేలం పాల్గొనేందుకు నిరాకరించారు. ట్రాన్స్‌పోర్టు వాహనాల నుంచి తైబజారు వసూలు మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందిన వేలం ధరను తగ్గించాలని, పెద్ద మొత్తంలో ధర నిర్ణయిస్తే మేము వేలంలో పాల్గొనలేమని చెప్పారు. దీంతో ధరలు తగ్గించి వేలం ప్రారంభించారు. చివరికి రూ.10.30లక్షలకు పట్టణానికి చెందిన రుక్మద్దీన్ వేలం దక్కించుకున్నాడు. గతేడాది 2022–23 సంవత్సరానికి గాను తైబజారు వేలం రూ.15లక్షలు పలకగా.. ఈ ఏడాది దానికంటే దాదాపు రూ.5లక్షలు తక్కువ పలకడం గమనార్హం.
అచ్చంపేట పశువుల సంత @ రూ.48.25లక్షలు
అచ్చంపేట రూరల్: అచ్చంపేటలో మొదటి సారి నిర్వహించిన పశువులు, మేకలు, గొర్రెల సంత వేలం పాట అత్యధిక ధర పలికింది. బుధవారం అచ్చంపేట మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నర్సింహగౌడ్ అధ్యక్షతన ఈ వేలం పాటను నిర్వహించారు. పశువులు, మేకలు, గొర్రెల సంతకు 14 మంది, తైబజార్‌కు 5 మంది టెండర్ వేశారు. పశువులు, గొర్రెలు, మేకల సంతను సతీష్‌యాదవ్ రూ. 48లక్షల 25వేలు, తైబజార్‌ను కనకటి ఆంజనేయులు రూ. 8లక్షల 60వేలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్, మేనేజర్ అనిత, సిబ్బంది మధు, తిర్పతయ్య, కౌన్సిలర్లు తగురం శ్రీనివాసులు, గౌరీశంకర్, రమేష్‌రావు, రమేష్, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలరాజు పాల్గొన్నారు.
‘కంటి వెలుగు’పై
అలసత్వం వద్దు
బిజినేపల్లి: కంటి వెలుగు కార్యక్రమంపై అలసత్వం ప్రదర్శించకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని, గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు తప్పక చేయాలని డీఎంహెచ్‌ఓ సుధాకర్‌లాల్ అన్నారు. బుధవారం మండలంలోని వట్టెంలో నిర్వహించిన కంటి వెలుగు శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. కంటి పరీక్షల తీరును గమనించారు. వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, శస్త్ర చికిత్సలు అవసరమైన వారి వివరాలు తప్పకుండా నమోదు చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత శస్త్రచికిత్స తేదీని వారికి తెలియజేయవచ్చని వివరించారు.
ప్రయాణికుల
సమస్యలు పరిష్కరిస్తాం
స్టేషన్ మహబూబ్‌నగర్: డయల్ యువర్ ఆర్‌ఎంకు వచ్చిన ప్రయాణికుల ఫిర్యాదులు, సూచనలను పరిశీలించి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్‌ఎం కార్యాలయంలో బుధవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు డయల్ యువర్ ఆర్‌ఎం నిర్వహించి ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. కోస్గి డిపో నుంచి మొకర్లబాద్ మీదుగా మంగంపేట, చౌదర్‌పల్లి, గాదిర్యాల్, చిన్నవార్వాల్, పెద్ద వార్వాల్‌కు బస్సు నడపాలని, మహమ్మదాబాద్ చౌరస్తాలో బస్సులు ఆపాలని, మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర, మరికల్, ఉందేకోడ్ వరకు బస్సులు నడపాలని కోరారు. మహబూబ్‌నగర్ బస్టాండ్‌లోని ఉడిపి హోటల్ వెనక భాగంలో దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే డయల్ యువర్ డీఎం కార్యక్రమంలో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ప్రయాణికుల నుంచి ఫోన్‌లో ఫిర్యాదులు తీసుకున్నారు.
