బోగస్‌ ‘బోనఫైడ్‌’లు! | - | Sakshi
Sakshi News home page

బోగస్‌ ‘బోనఫైడ్‌’లు!

Mar 30 2023 12:40 AM | Updated on Mar 30 2023 12:40 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులే టార్గెట్‌గా ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు దందా నిర్వహిస్తున్నారు. గురుకుల సీట్ల కోసం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రైవేట్‌ పాఠశాలల నుంచి బోగస్‌ బోనఫైడ్‌ సర్టిఫికెట్లు సృష్టించి మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. అక్కడైతే గురుకులాలకు కాంపిటిషన్‌ తక్కువగా ఉంటుంది.. సీటు సులభంగా వస్తుందని అమాయక తల్లిదండ్రులతో నమ్మబలికి.. వారి నుంచి రూ.వేలు దండుకుంటున్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.30వేల నుంచి రూ.50వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. గురుకులాల్లో సీటు దక్కితే తమ పిల్లలు పదో తరగతి, ఇంటర్‌ వరకు విద్యతో పాటు హాస్టల్‌లో ఉచిత వసతి లభిస్తుందనే ఆశతో తల్లిదండ్రులు ఆర్థిక భారమైనా సమర్పించుకుంటున్నారు. ఎడ్యుకేషన్‌ హబ్‌గా రూపాంతరం చెందిన వనపర్తి జిల్లాకేంద్రంగా రెచ్చిపోతున్న విద్యా మాఫియాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

ఎక్కడెక్కడ.. ఎలా అంటే..

ప్రాథమికోన్నత పాఠశాలలుగా అనుమతులు తీసుకున్నప్పటికీ.. పలు యాజమాన్యాలు హాస్టల్‌ వసతి ఏర్పాటు చేసి అనధికారికంగా కోచింగ్‌ సెంటర్లు నిర్వహిస్తున్నాయి. ఇలా వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు మండలాల్లో కోచింగ్‌ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. వాటి నిర్వాహకులు గురుకుల, నవోదయ, సైనిక్‌ స్కూల్‌ తదితర పోటీ పరీక్షలకు అనువైన విద్యార్థులను ఎంపిక చేసుకుని శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా ఐదు నుంచి ఏడో తరగతి స్టూడెంట్లను చేర్పించుకుంటున్నారు. ఆ తర్వాత నోటిఫికేషన్‌లో పేర్కొన్న వయసు మేరకు బోగస్‌ బోనఫైడ్‌లు సృష్టిస్తున్నారు. వయసు తక్కువ ఉన్నా.. ఎక్కువ ఉన్నా.. సర్టిఫికెట్లలో నిర్దేశిత వయసు ప్రకారం పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మార్చి పోటీ పరీక్షలకు దరఖాస్తు చేపిస్తున్నారు.

ఎంఈఓల లాగిన్‌

నుంచే అక్రమాలు..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో అడ్మిషన్‌ పొందిన విద్యార్థుల వివరాలను ప్రతి ఏటా తరగతుల వారీగా విద్యాశాఖ యూడైస్‌ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. ప్రతి ఒక్క విద్యార్థి వివరాలను ఎంఈఓ లాగిన్‌ ద్వారా నమోదు చేస్తారు. ఎవరైనా విద్యార్థి వేరే స్కూల్‌లో చేరాలనుకుంటే ప్రస్తుతం చదువుతున్న పాఠశాలకు ట్రాన్స్‌ఫర్‌ కోసం దరఖాస్తు చేయాలి. ఆ స్కూల్‌ హెచ్‌ఎం అనుమతి తీసుకోవాలి. తీసుకోని పక్షంలో ఆ విద్యార్థిని వేరే పాఠశాలలో చేర్చుకునే అవకాశం లేదు. కానీ ఆయా కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు అడ్డదారుల్లో ఈ తతంగం నడిపిస్తున్నారు. ఎంఈఓ లాగిన్‌ నుంచి అక్రమాలకు తెరలేపారు. గతంలో చదివిన స్కూల్‌తో సంబంధం లేకుండా.. తమ వద్దే అన్ని తరగతులు చదివినట్లు లేదంటే హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి బోగస్‌ రికార్డులు సృష్టిస్తున్నారు. నేరుగా వారు ఎంఈఓల లాగిన్‌ నుంచే ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ఎంఈఓ కార్యాలయాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్లు, డీఈఓ కార్యాలయంలోని పలువురు ఉద్యోగులు, సిబ్బందికి ముడుపులు అందజేస్తున్నట్లు సమాచారం.

ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్ల దందా

గురుకుల సీట్ల కోసం

దొంగ సర్టిఫికెట్ల సృష్టి

వనపర్తి జిల్లాకేంద్రంగా

రెచ్చిపోతున్న మాఫియా

విద్యాశాఖ అధికారులతో

నిర్వాహకుల కుమ్మక్కు

ఒక్కొక్కరి వద్ద

రూ.50 వేల

వరకు అదనంగా వసూళ్లు

‘స్థానికత’ కోల్పోతున్న విద్యార్థులు

కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నాం..

ఈ విషయంపై జిల్లాలోని కొన్ని పాఠశాలలపై ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్‌ ఆదేశం మేరకు విచారణ చేస్తున్నాం. ఎంఈఓల లాగిన్‌ నుంచి యూ డైస్‌ ఎలా మార్చారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం. పెబ్బేరు పట్టణంలోని స్కూల్స్‌పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ పూర్తి కాలేదు. త్వరలో విచారణ పూర్తిచేసి చర్యలు తీసుకుంటాం.

– రవీందర్‌, డీఈఓ, వనపర్తి

ఇలా వెలుగులోకి.. అయినా చర్యలు శూన్యం

జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండలం గార్లపాడులోని మండల పరిషత్‌ హైస్కూల్‌లో నాలుగో తరగతికి చెందిన ఒకరు, ఐదో తరగతికి చెందిన ఇద్దరు, ఆరో తరగతికి చెందిన ఒక విద్యార్థి ట్రాన్స్‌ఫర్‌కు దరఖాస్తు చేయకుండానే 2022–23లో పెబ్బేరులోని సరస్వతి విద్యానికేతన్‌, శ్రీవిజ్ఞాన్‌ హైస్కూల్‌లో అడ్మిషన్‌ తీసుకున్నారు. వారికి ఎంఈఓ లాగిన్‌లో ఆన్‌లైన్‌ డేటాకు పర్మిషన్‌ ఇచ్చారు. పసిగట్టిన ఆ స్కూల్‌ హెచ్‌ఎం ఈ సమాచారాన్ని గద్వాల డీఈఓకు అందించగా.. ఆయన వనపర్తి డీఈఓ రవీందర్‌కు ఫిర్యాదు చేశారు. సదరు విద్యాసంవత్సరంలో ఆయా పాఠశాలల్లో చదివినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గతేడాది నవంబర్‌లో ఫిర్యాదు చేసినా.. ఇప్పటివరకు ఎవరిపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement