
మాట్లాడుతున్న కలెక్టర్ ఉదయ్‌కుమార్
నాగర్‌కర్నూల్: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు జిల్లావ్యాప్తంగా ఉన్న 1,994 చెరువులు, కుంటల పరిధిలోని వెయ్యి కి.మీ., మేర మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ ఉదయ్‌కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో 9వ విడత హరితహారంలో నీటి వనరుల సంరక్షణ, మొక్కలు నాటే కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 20 మండలాల వారీగా ఉన్న చెరువులు, కుంటల భూముల పరిరక్షణకు రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి వచ్చేనెల 10వ తేదీ నాటికి సమగ్ర వివరాలను అందజేయాలన్నారు. మొక్కల పెంపకంతోపాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, కుంటలు, చెరువుల చుట్టూ ఎఫ్‌టీఎల్ పరిధి భూముల్లో మొక్కలను నాటాలని సూచించారు. గతేడాది భారీ వర్షాల కారణంగా తెగిన కుంటలు, చెరువులకు మరమ్మతు చేపట్టి మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మనూచౌదరి, మోతీలాల్, నీటి పారుదల శాఖ ఈఈ మురళి, డీఆర్‌డీఓ నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.