
మాట్లాడుతున్న అడిషనల్ కలెక్టర్ మనూచౌదరి
అచ్చంపేట రూరల్: ప్రణాళికాబద్ధంగా పట్టణాలను అభివృద్ధి చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ మనూచౌదరి సూచించారు. సోమవారం అచ్చంపేట మున్సిపల్ కార్యాలయంలో 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రత్యేక సమావేశాన్ని మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యాలయ సిబ్బంది ఖాన్ బడ్జెట్ సమావేశ ఎజెండాను చదివి వినిపించారు. పలువురు కౌన్సిలర్లు సమస్యలను వివరించారు. కాలనీల్లో పార్కులకు కేటాయించిన స్థలాలను పలు కుల సంఘాలకు కట్టబెట్టారని, పట్టణ ప్రజలకు ఆహ్లాదం కనుమరుగైందన్నారు. ఏళ్ల కిందట నిర్మించిన మురుగు కాల్వలు శిథిలావస్థకు చేరాయని నూతనంగా నిర్మించాలన్నారు. పాత బజార్‌లో పబ్లిక్ టాయిలెట్లు లేవని నిర్మించాలని, కుక్కలు, పందులు, కోతుల బెడద ఉందని ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టడానికి కృషి చేస్తామన్నారు. ఇక ఫైనల్ లేఅవుట్లపై సమాచారం అందిస్తామని, కౌన్సిల్ తీర్మానం ప్రకారం అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఛైర్మన్ నర్సింహగౌడ్, వైస్ ఛైర్‌పర్సన్ శైలజారెడ్డి, కమిషనర్, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.