ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి

- - Sakshi

నాగర్‌కర్నూల్‌: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అడిషనల్‌ కలెక్టర్‌ మోతీలాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు 20 ఫిర్యాదులు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ నర్సింగరావు, సీపీఓ భూపాల్‌రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 9 అర్జీలు

నాగర్‌కర్నూల్‌ క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్‌ ప్రజావాణికి 9 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులతో ఎస్పీ మనోహర్‌ నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుల్లో భర్త వేధింపులకు సంబంధించి 2, డబ్బులు తీసుకొని మోసం చేశారని, తండ్రిపై దాడి చేసిన కొడుకులపై చర్య తీసుకోవాలని, పాత కేసు పురోగతిపై ఒకటి, భూసంబంధిత గొడవ తదితర వాటిపై ఫిర్యాదులు అందాయని ఆయన వివరించారు. ఫిర్యాదులు వేగవంతంగా పరిష్కరించాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.

ప్రజారోగ్యానికి పెద్దపీట

కొల్లాపూర్‌: ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం కొల్లాపూర్‌ సమీపంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన డయాలసిస్‌ సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు డయాలసిస్‌ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని డయాలసిస్‌ సెంటర్‌ను కొల్లాపూర్‌లో ఏర్పాటుచేయాలని మంత్రి హరీష్‌రావును కోరగా.. వెంటనే సెంటర్‌ను ఏర్పాటుచేసి, దాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. డయాలసిస్‌ రోగుల సంఖ్య ప్రకారం సెంటర్‌లో మరిన్ని యూనిట్లు పెంచేందుకు కృషిచేస్తానని ఆయన అన్నారు. అలాగే, పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్షిత మంచినీటి ప్లాంటును ఎమ్మెల్యే ప్రారంభించారు. కమ్యూనిటే డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. కార్యక్రమాల్లో డీఎంహెచ్‌ఓ సుధాకర్‌లాల్‌, వైద్యులు రమేష్‌చంద్ర, శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌, యాదగిరి బిల్లా, జయచంద్రప్రసాద్‌ యాదవ్‌, లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Nagarkurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top